ఏపీలో సినిమా టికెట్ల ధరల వ్యవహారం, థియేటర్ల మూసివేత, తనిఖీల ఇష్యూ పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంపై ఓ కమిటీ వేసిన ప్రభుత్వం…తాము కోర్టులు చెప్పిన ప్రకారమే కమిటీ వేశామని, ఆ కమిటీ నివేదిక ప్రకారం తుది నిర్ణయం తీసుకుంటామని చెబుతోంది. అయితే, ప్రభుత్వ నిర్ణయంపై హీరో నాని, హీరో సిద్ధార్థ్, నిర్మాత ఎన్వీ ప్రసాద్, రామ్ గోపాల్ వర్మ వంటి కొందరు స్పందించారు.
కానీ, చాలామంది దీనిపై స్పందించాలని ఉన్నా…రకరకాల కారణాలతో స్పందించకుండా సైలెంట్ గా ఉన్నారు. ఈ క్రమంలోనే సినీ ప్రముఖులపై టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ వేధింపులపై సినీ పెద్దలు ఎందుకు స్పందించట్లేదని అనగాని ప్రశ్నించారు. తనిఖీల పేరుతో థియేటర్లు మూతపడుతున్నాయని, దాంతో, ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా మంది ఉపాధి కోల్పోతున్నారని అన్నారు.
జగన్ వేధింపులపై సినీ పెద్దలు నోరు మెదపట్లేదని, ఏపీలో హీరోలు రీల్ హీరోలుగానే మిగిలిపోతున్నారని, వారు రియల్ హీరోలుగా మారరా? అని అనగాని నిలదీశారు. కావేరి నదీ జలాల సమస్య, జల్లికట్టు సమస్యలపై అక్కడి సినీ పరిశ్రమంతా ఏకతాటిపైకి వచ్చిందని గుర్తు చేశారు. కానీ, తెలుగు హీరోలు మాత్రం ఇండస్ట్రీ, థియేటర్ల సమస్యలపై ఎందుకు ప్రశ్నించడం లేదని అనగాని నిలదీశారు. వారి సినిమాలు ప్రజలు చూడాలి కానీ, ప్రజల కష్టాలు ఆ హీరోలకు పట్టవా? అని ప్రశ్నించారు. థియేటర్లపై ప్రభుత్వం చర్యల వల్ల పరోక్షంగా కూడా చాలామంది ఉపాధి కోల్పోతున్నారని ఆయన అన్నారు.