ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలిరోజే మూడు రాజధానులప చర్చ జరగబోతుందన్న ప్రచారం నేపథ్యంలో మొదటి రోజే సభ వాడీవేడిగా సాగనుంది అని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే తొలిరోజు సభ రసాభాసతోనే మొదలైంది. సభ ప్రారంభం కాగానే…జాబ్ క్యాలెండర్ కాస్తా జాబ్ లెస్ క్యాలెండర్ అయిందంటూ జగన్ ను ఉద్దేశించి టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.
ఆ అంశంపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టి దానిపై చర్చ జరపాలని వారు పట్టుబట్టారు. కానీ, ఆ తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో, టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్పీకర్ కొనసాగించారు. దీంతో, సభకు టీడీపీ సభ్యులు గౌరవం ఇవ్వడం లేదని, వారిపై చర్యలు తీసుకోవాలని బుగ్గన కోరారు.
స్పీకర్ పోడియంలోకి వెళ్లి టీడీపీ సభ్యులు రెడ్ లైన్ దాటారని, ప్లకార్డులు పట్టుకొని సభలోకి రావడం సరికాదని బుగ్గన అన్నారు. ఆ తర్వాత స్టడీ సర్కిల్ విషయంలో మంత్రి మేరుగ నాగార్జున సమాధానం చెపుతున్నప్పుడు కూడా టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ వాయిదా తీర్మానం కోసం పట్టుబట్టారు. దీంతో మంత్రి నాగార్జున తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామిపై మంత్రి నాగార్జున వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘నువ్వు దళితుడివైతే, దళితులకు పుడితే.. టీడీపీ అధినేత చంద్రబాబు బంధనాల నుంచి బయటకు రావాలి’’ అంటూ మంత్రి నాగార్జున నిండు సభలో అవమానకరరీతిలో మాట్లాడడం సంచలనం రేపింది. మేరుగ వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు మండిపడ్డారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.