ఏపీ టీడీపీ నేతల మధ్య ఓ విషయంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. వైసీపీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలపై శాసన వేదికలుగా నిలదీస్తున్న టీడీపీకి.. ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చిపడిందని.. శాసనసభలో పార్టీకి బలం లేకపోవడంతో.. ఇప్పటి వరకు అంటే.. గడిచిన రెండేళ్లుగా.. శాసన మండలి వేదికగా.. ప్రజాగళం వినిపిస్తూ.. వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతోంది.
అయితే.. ఇప్పుడు మండలిలో టీడీపీకి మెజారిటీ లేకపోవడంతో.. ఇబ్బందులు తప్పవని.. కొన్ని వ్యాఖ్యానాలు.. విశ్లేషణలు జోరుగాసాగుతున్నాయి. దీనిపై దృష్టి పెట్టిన విజయవాడకు చెందిన సీనియర్ నాయకుడు ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖకు చెందిన పార్టీ సీనియర్లు కూడా ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. వీరి మధ్య ఇదే విషయంపై చర్చ సాగుతోంది.
“నిజమే.. ఇప్పుడు మారిన సమీకరణలతో టీడీపీ ఇప్పటి వరకు బలంగా ఉన్న శాసన మండలిలోనూ మెజారిటీ తగ్గింది. అయినంత మాత్రాన నష్టంలేదు“ అని విజయవాడకు చెందిన సీనియర్ నాయకుడు.. ఒకరు భరోసా వ్యక్తం చేశారు. అంతేకాదు.. మండలిలో ప్రస్తుతం నారా లోకేష్ ఉన్నందున ఆయన దూకుడుకు వైసీపీ నేతలు వెనక్కి తగ్గక తప్పదని.. ఏ విషయంపైనా.. నిశితంగా ఆయన దృష్టి పెడుతున్నారని అంటున్నారు. ఇటీవల మూడు రాజధానులు, సీఆర్ డీఏ రద్దు వంటి అంశాల్లో చర్చల సందర్భంగా లోకేష్ వ్యవహరించిన తీరును సదరు నేతలు గుర్తు చేస్తున్నారు.
ఇక, ఇదే విషయాన్ని విశాఖపట్నానికి చెందిన సీనియర్ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే ఒకరు కూడా చెబుతున్నారు. “శాసన సభలో చంద్రబాబు, మండలిలో లోకేష్ ఉన్నారు. అది చాలు. వైసీపీ నేతలకు కళ్లెం వేయడానికి. మిగిలిన సీనియర్లు ఎలానూ ఉన్నారు. కాబట్టి.. ఇప్పుడు వస్తున్న విమర్శలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు మెజారిటీతోనే పనిలేదు. వాయిస్ ఉంటే చాలు. ఈ విషయంలో మాకు ఇబ్బందిలేదు“ అని వ్యాఖ్యానించారు. ఇక, ప్రస్తుతం టీడీపీకి మండలిలో ఉన్న నేతల విషయాన్ని చూస్తే.. ఇటీవల రిటైరైన.. బుద్ధా వెంకన్న, బీటెక్ రవి వంటివారు.. ఫైర్ బ్రాండ్ నేతలుగా ఉన్నారు.
వీరి రిటైర్మెంట్ సహా.. మరికొందరు మండలికి దూరం కావడంతో టీడీపీకి సహజంగానే మెజారిటీ తగ్గింది. అయినప్పటికీ.. యనమల రామకృష్ణుడు(2025), నారా లోకేష్(2023), పరుచూరి అశోక్బాబు(2025), శతృచర్ల విజయరామరాజు(2023) వంటి వారు దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
సో.. ఇప్పట్లో అయితే.. మెజారిటీ తగ్గినా.. ఇబ్బంది లేదు.. అటు బాబు, ఇటు లోకేష్ సమర్ధంగా జగన్ ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించడంతోపాటు.. అడ్డుకుంటారనే ధీమా వ్యక్తమవుతుండడం గమనార్హం.