ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టీడీపీ కి చెందిన సభ్యు లు సభకు హాజరై ప్రజాసమస్యలపై పోరాడాలని.. ప్రబుత్వాన్ని ప్రశ్నించాలని అనుకున్నారు. అయితే.. వీరి వ్యూహం ఫలించలేదు. ఎందుకంటే ప్రభుత్వం అడుగడుగునా నిర్బంధాలు సృష్టించింది. ఈ రోజు ఉదయమే నందమూరి బాలకృష్ణ, కింజరాపు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటివారు.. ప్లకార్డులు పట్టుకుని ర్యాలీగా సభకు వచ్చారు.
అయితే.. ఇలా రావడాన్ని పోలీసలు అడ్డుకున్నారు. సభలోకి ప్రవేశించడానికి వీల్లేదంటూ.. లోక్సభకు కిలో మీటరు దూరంలోనే వీరిని నిలిపేశారు. ఈ సందర్భంగా పోలీసులు.. టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం.. వివాదం చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ప్లకార్డులు పట్టుకుని సభలోకి వెళ్లేందుకు పోలీసులు అడ్డుకు న్నారు. దీంతో టీడీపీ సభ్యులు కొద్ది సేపు అక్కడే ఉండి నిరసన తెలిపారు. అనంతరం.. సభలోకి వెళ్లినా.. అక్కడ కూడా.. వారు ఎక్కువ సేపు ఉండలేదు.
తొలిరోజు బడ్జెట్ సెషన్ ప్రారంభం కాగానే.. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించడం ప్రారంభించారు. అయితే.. ఆయనతో అన్నీ అబద్ధాలే చెప్పిస్తున్నారంటూ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే సభ నుంచి వాకౌట్ చేశారు. అబద్దాలు వినలేకపోతున్నామంటూ నినాదాలు చేశారు. నజీర్ ప్రసంగం మొదలైనప్పటి నుంచి పలు అంశాలపై టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలుపుతూనే వచ్చారు. ముందుగా జగనన్న విద్యా దీవెన పథకంలో పూర్తి రీయింబర్స్మెంట్ ఇచ్చామని గవర్నర్ చెప్పగా.. పూర్తి రీయింబర్స్మెంట్ అంతా అబద్దమంటూ నినాదాలు చేశారు.
చంద్రబాబు ఏరీ?
టీడీపీ పక్ష నాయకుడు, మాజీ సీఎం చంద్రబాబు బడ్జెట్ సమావేశాలకు రాలేదు. గత రెండేళ్ల కిందట ఆయన చేసిన శపథం మేరకు.. ఆయన చివరి సమావేశాలను కూడా బహిష్కరించారు. అప్పట్లోకౌరవ సభలో ఉండనని ప్రతిజ్ఞ చేసిన బాబు.. అనుకున్న విధంగానే చివరి భేటీకి కూడా రాలేదు. మరోవైపు.. రా.. కదలిరా! సభకు ఆయన విశాఖలోని మాడుగుల నియోజకవర్గానికి వెళ్లారు. ఈ రోజు రెండు చోట్ల రా.. కదలిరా! సభల్లో చంద్రబాబు పాల్గొంటారు.