అసెంబ్లీ నిండు సభలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు, ఆయన కుటుంబానికి జరిగిన ఘోర అవమానంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ సభ్యులు బరితెగించి ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఈ క్రమంలోనే జగన్ సర్కార్ పై టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత, పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. అరాచకత్వానికి ప్రతీకగా ఈ ప్రభుత్వం నిలిచిందని, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబునుద్దేశించి వైసీపీ నేతలు అవమానిస్తున్నారని దుయ్యబట్టారు.
చంద్రబాబును అసెంబ్లీకి తీసుకురావాలని, ఆయనను చూడాలనిపిస్తోందని, రెచ్చగొట్టే దోరణితో జగన్ నిన్న మాట్లాడారని, ఈ రోజు జరిగిన దానికి కారణం జగన్ అని ఆరోపించారు. సభలో వైసీపీ సభ్యులు దిగజారి మాట్లాడారని, వారికి స్పీకర్ కూడా మైకులు ఇచ్చారని ఆరోపించారు. ఆ వ్యాఖ్యలకు చంద్రబాబుతోపాటు తమకూ కళ్లల్లో నీళ్లు వచ్చాయన్నారు. చంద్రబాబును ఇలా చూడడం ఇదే మొదటిసారని నిమ్మల అన్నారు.
వ్యక్తిగతంగా విమర్శించే హక్కు ఏ ఒక్కరికి లేదని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. చంద్రబాబును దూషిస్తుంటే జగన్ రెడ్డి వెకిలి నవ్వులు నవ్వుతున్నాడని సునీత మండిపడ్డారు. జగన్ కు ఉన్న సంస్కారం ఇదేనా అని సునీత ప్రశ్నించారు. వివేక హత్య టాపిక్ ను దారి మళ్లించేందుకే ఇలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు అమానుషమని ఆమె మండిపడ్డారు. ఇ
ఇక, ఏపీ అసెంబ్లీ కౌరవసభను తలపించేలా ఉందని, టీడీపీ అధికారంలోకి వస్తే కొడాలి నాని, అంబటి రాంబాబు పరిస్థితి ఏంటని కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని బజారులో పిచ్చికుక్కను కొట్టినట్లు కొడతారని కాల్వ అన్నారు. పిచ్చికుక్కల కంటే హీనంగా వైసీపీ నాయకులు మాట్లాడారని, కొడాలి నాని సంస్కార హీనుడు.. లుచ్చా రాజకీయం చేస్తున్నాడని కాల్వ విమర్శించారు. వ్యక్తిగత దూషణ, కుటుంబ సభ్యులపైన అభాండాలు వేస్తుంటే చూస్తూ ఊరుకోమని కాల్వ వార్నింగ్ ఇచ్చారు.