జగన్ హయాంలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, హత్యలు పెరిగాయన్న విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. గుంటూరులోని పల్నాడు ప్రాంతంలో టీడీపీ నేత చంద్రయ్య హత్యోదంతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ వ్యవహారం సద్దుమణగక ముందే తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో నరసరావుపేట టీడీపీ ఇన్ చార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకు గాయాలు కావడం దుమారం రేపుతోంది.
ఈ వ్యవహారంలో అరవిందబాబుతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, ఆయనపై చేయి చేసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అరవిందబాబుపై దాడిని పలువురు టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. అరవిందబాబును పరామర్శించిన టీడీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, జవహర్, మాజీ ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, తెనాలి శ్రావణ్ కుమార్, జీవీ ఆంజనేయులు తదితరులు నరసరావుపేటలో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.
నరసరావుపేట టిడిపి ఇంచార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు గారిపై పోలీసుల దాడికి నిరసనగా నరసరావుపేట టిడిపి కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నల్ల జెండాలతో ర్యాలీలో పాల్గొన్న టిడిపి శ్రేణులు. (1/3) pic.twitter.com/IZC5aZ1Adv
— Telugu Desam Party (@JaiTDP) January 16, 2022
నల్ల కండువాలు ధరించి పట్టణంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. టీడీపీ కార్యకర్తల అరెస్ట్ అక్రమం అని, వారిని తక్షణమే విడుదల చేయాలని నినాదాలు చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన టిడిపి కార్యకర్తలను విడుదల చేయాలన్న నినాదాలతో నరసరావుపేట దద్దరిల్లింది. అరవింద బాబు పై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.అంతకుముందు, వైఎస్సార్ విగ్రహ ధ్వంసం చేశారన్న ఆరోపణలతో ఇద్దరు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, వారిని వదిలిపెట్టాలంటూ అరవిందబాబు ధర్నా చేపట్టారు. ఈ క్రమంలోనే టీడీపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో అరవిందబాబు గాయపడ్డారు. అయితే, తోపులాట సందర్భంగా అరవిందబాబుపై పోలీసులు చేయి చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.