అవును చంద్రబాబునాయుడుకే కొందరు సీనియర్లు పెద్ద షాకిచ్చారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరించినట్లు చంద్రబాబు ప్రకటించిన గంటల్లోనే కొందరు సీనియర్లు తమ అసంతృప్తిని వ్యక్తంచేశారు. చంద్రబాబు నిర్ణయానికి భిన్నంగా వ్యవహరించబోతున్నట్లు డైరెక్టుగానే చెప్పేశారు. పార్టీ నిర్ణయంతో విభేదిస్తు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పదవికి రాజీనామా చేశారు.
అలాగే విజయనగరం జిల్లాలో పరిషత్ ఎన్నికల్లో పార్టీ నేతలు పాల్గొంటారని కేంద్ర మాజీమంత్రి, సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ప్రకటించటం సంచలనంగా మారింది. చంద్రబాబు నిర్ణయంతో తమకు సంబంధం లేదని జిల్లాలోని నేతలంతా ఎన్నికల్లో పాల్గొనాల్సిందే అని అశోక్ పట్టుబట్టినట్లు విజయనగరం నియోజకవర్గ ఇన్చార్జి అదితి గజపతిరాజు చెప్పటం గమనార్హం.
దీన్నిబట్టి చూస్తే పార్టీలో చాలామంది సీనియర్ నేతలకు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం రుచించటం లేదని అర్ధమైపోతోంది. గెలుపోటములతో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే అని మెజారిటి నేతలు చెప్పినట్లు సమాచారం. అయితే కొంతమంది నేతల మాటలు విన్న చంద్రబాబు ఎన్నికల బహిష్కరణకు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.
ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకునే ముందు పాలిట్ బ్యూరో సమావేశంలో చర్చించటం కాదని జిల్లాల్లోని నేతలతో మాట్లాడాలని అశోక్ చేసిన సూచనకు మద్దతు పెరుగుతోంది. ప్రజా జీవితంతో సంబంధం లేని వాళ్ళని, దశాబ్దాలుగా ఎన్నికల్లో ఓడిపోతున్న వాళ్ళ మాటలకే చంద్రబాబు ఎక్కువ విలువిస్తున్నారనే ఆరోపణలు పార్టీలోనే పెరిగిపోతున్నాయి.
మొత్తం మీద చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించే నేతల సంఖ్య పెరుగుతోంది. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి వాతావరణం టీడీపీలో లేదు. చంద్రబాబు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఇష్టం ఉన్నా లేకపోయినా మాట్లాడేవారు కాదు. కానీ ఇపుడు తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం నేతలు బహిరంగంగానే తప్పుపడుతున్నారు. పైగా పార్టీ నిర్ణయంతో సంబంధం లేదన్నట్లుగా నేరుగానే మాట్లాడేస్తున్నారు. మొత్తానికి ఎన్నికల బహిష్కరణ నిర్ణయం ముందు ముందు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే.