వైసీపీ నేత, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఉదంతం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్ లకే రక్షణ లేకపోవడం వంటి వ్యవహారాలపై ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంపీ కుటుంబానికి రక్షణ లేదంటే జగన్ ప్రభుత్వం పరిపాలన ఏవిధంగా ఉందో అర్థమవుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలోనే ఎంవీవీ సత్యనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. తనకు ఏపీలో రాజకీయాలు, వ్యాపారాలు ఒకేసారి నిర్వహించడం కష్టమవుతుందని, అందుకే హైదరాబాద్ లో వ్యాపారాలు చేద్దామని డిసైడ్ అయ్యానని సన్నిహితుల దగ్గర ఎంవీవీ వాపోయారట. ఎంపీ అయినందున ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉండటంతో బాధేస్తోందని సన్నిహితుల దగ్గర ఎంవీవీ అన్నారట. అయితే, ప్రజాసేవ కోసం విశాఖలో రాజకీయాలు చేస్తానని చెప్పారట. అనవసరంగా వ్యాపారాన్ని, రాజకీయాలను కలిపేస్తున్నారని ఎంవీవీ ఆవేదన వ్యక్తం చేశారట. డబ్బుల కోసం కిడ్నాప్ చేసినంత మాత్రాన విశాఖ వదిలి పారిపోతానా అని ఆయన అన్నట్టుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఏపీ గవర్నర్ నజీర్ ను టీడీపీ నేత అచ్చెన్నాయుడు కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస దాడుల గురించి అచ్చెన్నతో పాటు నక్కా ఆనందబాబు, బోండా ఉమ తదితరులు గవర్నర్ కు వివరించారు. అధికార వైసీపీ ఎంపీయే రాష్ట్రంలో బతకలేమని అంటున్నారని వెల్లడించారు. విద్యార్థి అమర్నాథ్ హత్య ఘటనను కూడా ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. తమ అభ్యర్థనపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని అచ్చెన్న అన్నారు. మణిపూర్ తరహాలో ఏపీలో కూడా అధికారిని నియమించాలని గవర్నర్ ను కోరినట్లు చెప్పారు.