విజయవాడ లో టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కొందరిని గృహ నిర్బంధం చేశారు. దీంతో ఒక్కసారిగా విజయవాడలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. తాజాగా గురువారం మధ్యాహ్నం. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఐటీ అధికారుల దాడులు.. జీఎస్టీ అధికారుల ఫిర్యాదులు, మాచవరం పోలీసుల అరెస్టులతో ఈ వ్యవహారం రాజకీయ దుమారానికి దారితీసింది.
మరోవైపు పోలీసులు అరెస్టు చేసిన ప్రత్తిపాటి తనయుడు శరత్‌ను ఎక్కడ ఉంచారనే విషయంపై టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ.. విజయవాడ లోని కమిషనర్ కార్యాలయం ముందు.. పట్టాభి, దేవినేని ఉమా మహేశ్వరరావు, వర్ల రామయ్య తదితరు లు ఆందోళనకు దిగారు.శరత్ అరెస్టు వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని.. కక్ష గట్టి.. చేస్తున్నారని. సీఎం జగన్ డౌన్ డౌన్ అని నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. దీనిని ముందుగానే పసిగట్టిన పోలీసులు.. బందరు రోడ్డుపై ట్రాఫిక్‌ను దారి మళ్లించారు.
అదేసమయంలో నిరసన పెద్దది అవుతోందని గ్రహించి.. ఎక్కడ నుంచి ఎవరూ కమిషనర్ కార్యాలయాని కి రాకుండా.. అన్ని రోడ్లను దిగ్బంధించారు. ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నాయకులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయం తెలిసి.. పలువురు విజయవాడకు బయలు దేరగా ఎక్కడకక్కడ వారిని నిలువరించే ప్రయత్నాలు చేశారు. తమ కుమారుడిని చూపించేంతవరకు ఆందోళన విరమించబోమని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఇప్పటికే టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పట్టాభి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ మంత్రినక్కా ఆనందబాబులు కమిషనర్‌తో చర్చలు జరుపుతున్నారు.