కరోనా కట్టడిలో ఏపీ సీఎం జగన్ ఘోరంగా విఫలమయ్యారని తీవ్ర విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో రోగులకు భరోసా నింపాల్సిన జగన్…తాడేపల్లిలోని ప్యాలెస్ లో పబ్జీ ఆడుకుంటూ సేద తీరుతున్నారని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా బాధితులలో భరోసా నింపేందుకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితుల భరోసా కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది.
ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల్లోని కోవిడ్ కేర్ సెంటర్లు, ఆసుపత్రులలో చికిత్స పొందుతోన్న కరోనా రోగులను పరామర్శించాలని, అక్కడి వైద్య సదుపాయాల గురించి తెలుసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమైన టీడీపీ నేతలను రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు హౌస్ అరెస్టు చేయడంపై విమర్శలు వస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచుతున్నారు.
ఈ క్రమంలోనే ఉంగుటూరులో ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, దెందులూరులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కడప జిల్లా సింహాద్రిపురంలో ఎమ్మెల్సీ బీటెక్ రవితో పాటు పలువురు నేతలను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.
ఇక, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టీడీపీ శాసన సభాపక్ష ఉపనేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో, రామానాయుడు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏలూరు పర్యటనకు వెళ్లిన తనను హౌస్ అరెస్టు చేయడంపై రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల హౌస్ అరెస్టులను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.
రాష్ట్రంలో సరైన వైద్యం అందక ప్రజలు చనిపోతున్నా…జగన్ గడపదాటి బయటకు రారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆస్పత్రులను జగన్ ఎందుకు సందర్శించడం లేదని, ప్రజల ఆరోగ్యం పట్ల జగన్ కు బాధ్యత లేదా? అని ఆయన నిలదీశారు. కరోనా ఫస్ట్ వేవ్ నేర్పిన గుణపాఠాన్ని జగన్ పట్టించుకోలేదని, ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడానికి ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షల రూపాయలు దండుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
టీడీపీ నేతలు కోవిడ్ కేర్ సెంటర్లు, ఆస్పత్రులను సందర్శిస్తే తమ ప్రభుత్వ గుట్టురట్టవుతుందని జగన్ వెన్నులో వణుకుపుట్టిందని, అందుకే ఎక్కడికక్కడ టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తన పాలన మీద అంత నమ్మకం ఉన్న జగన్…టీడీపీ నేతలను ఆస్పత్రులు సందర్శించేందుకు అనుమతివ్వాలని వారు డిమాండ్ చేశారు.