విశాఖకు మణిమకుటంగా ఉన్న రుషికొండ కు వైసీపీ నేతలు గుండు కొట్టిన సంగతి తెలిసిందే. ఐదేళ్లుగా ఇక్కడ ప్రభుత్వ భవనాల నిర్మాణాలు అంటూ వైసీపీ నేతలను మినహా ఏ ఒక్కరినీ ఇక్కడకు రానివ్వలేదు. రహస్యంగా అక్కడ చేపట్టిన టూరిజం శాఖకు చెందిన బిల్డింగుల నుంచే జగన్ పాలన కూడా మొదలుబెడతారని ప్రచారం కూడా చేశారు. కట్ చేస్తే ఇపుడు వైసీపీ ఘోర పరాజయం పాలు కావడంతో తాజాగా తెలుగు తమ్ముళ్లు రుషికొండలోని ఆ బిల్డింగులపైకి ఎక్కి టీడీపీ జెండాను రెపరెపలాడించారు.
టీడీపీ కూటమి అఖండ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న టీడీపీ కార్యకర్తలు విశాఖకు మణిహారంగా మారిన ప్రకృతి సిద్ధి రుషికొండపై పసుపు జెండా ఊపి తమ గెలుపును సెలబ్రేట్ చేసుకున్నారు. అక్కడ పసుపు స్మోక్ వదిలి విజయాన్ని ఆస్వాదించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రుషికొండపై జగన్ పాలన మొదలుబెట్టాలని, అక్కడ సీఎం క్యాంపు ఆఫీసు తదితరాలను వైసీపీ నేతలు నిర్మించారు. అయితే, ఆ ఆశలు గల్లంతయ్యాయి. దీంతో, వందల కోట్ల ప్రజాధనం ఖర్చుపెట్టి నిర్మించిన రుషికొండపై టీడీపీ నేతలు జెండా ఎగుర వేశారు. ఆ నిర్మాణాల కోసం వందల కోట్లు ఖర్చు పెట్టిన వైసీపీ నేతలకు కొందరు ఉన్నతాధికారులు కూడా సహకరించి అత్యుత్సాహం చూపారని, కోర్టును కూడా తప్పదోవ పట్టించారనే ఆరోపణలున్నాయి.
ఇక, విశాఖ నగరానికే శోభాయమానమైన రుషికొండ సముద్ర తీరానికి ఆనుకొని ఎంతో సుందరంగా కనిపిపస్తుంటుంది. కానీ, వైసీపీ పాలనలో గుండు కొట్టించుకున్న ‘రుషికొండ’ దయనీయ స్థితి చూసి ప్రకృతి ప్రేమికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విమాన ప్రయాణికులు కూడా ఈ ప్రాంతాన్ని తిలకిస్తూ విశాఖ సొబగులకు ముగ్ధులవుతారు. పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్టు అంటూ కొండ చుట్టూ తవ్వేసి పైభాగం వదిలారు. దీంతో రుషికొండకు గుండు కొట్టినట్లుగా మారి కళా విహీనంగా కనిస్తోంది.