వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ లపై సమయం సందర్భం లేకుండా అసభ్య పదజాలంతో విమర్శలు గుప్పించడం కొడాలి నానికి అలవాటు. కొడాలి నాని ప్రెస్ మీట్ పెడితే చాలు…విషయం ఏదైనా సరే అది తిరిగి తిరిగి చంద్రబాబు, లోకేష్ లకు దగ్గరకు చేరుతుంది. అందుకే, కొడాలి నానిని టిడిపి నేతలు అంతా ముద్దుగా బూతులు మంత్రి అని పిలుస్తుంటారు. కొడాలి నాని భాష అసభ్యకరంగా ఉందంటూ జనసేన, సిపిఐ సహా విపక్ష పార్టీలన్నీ దుమ్మెత్తి పోస్తున్నా సరే ఆయన తీరు మారడం లేదు.
ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు, లోకేష్ లపై కొడాలి నాని మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఇన్నాళ్లు నాని వ్యాఖ్యలను ఉపేక్షించిన టిడిపి నేతలు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిపై టిడిపి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడాలి నానిపై కేసు నమోదు చేసి చట్టపరంగా శిక్షించాలని టిడిపి సీనియర్ నేతలు దేవినిని ఉమా, గద్దె రామ్మోహన్ రావు, బుద్ధా వెంకన్న, వర్ల రామయ్యలు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కొడాలి నాని పై ఫిర్యాదు చేశారు.
వారి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కొడాలి నానిపై కేసు నమోదు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నారు. టిడిపి నేతలే కాదు సోషల్ మీడియాలోనూ కొడాలి నాని భాషపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. బాధ్యత గల హోదాలో ఉన్న కొడాలి నాని వీధి రౌడీలాగా అసభ్యకర పదజాలంతో ప్రతిపక్ష నేతలను విమర్శించడం సరికాదని కామెంట్లు పెడుతున్నారు. ప్రజా ప్రతినిధులే ఇలా బూతులు మాట్లాడుతుంటే ప్రజలకు వారు ఏమి సేవ చేస్తారని నిలదీస్తున్నారు. మరి కొడాలి నానిపై పోలీసులు కేసు నమోదు చేస్తారా లేక ఎప్పటిలాగే అధికార పార్టీకి అండగా నిలుస్తూ ఆ వ్యవహారాన్ని అటకెక్కిస్తారా అన్నది తేలాల్సి ఉంది.
Comments 1