ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలోని కొడాలి కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో ఏర్పాటు చేశారంటూ టీడీపీ నేతలు, విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని పోలీసులకు కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు టీడీపీ ఓ నిజనిర్ధారణ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే గుడివాడ వెళ్లి క్యాసినో వ్యవహారంపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రయత్నించిన టీడీపీ నిజనిర్ధారణ కమిటీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలోనే గుడివాడలోని టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి యత్నించారు. టీడీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారు. అంతేకాదు టీడీపీ నేత బోండా ఉమ కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత రాళ్లురువ్విన వారిని వదిలేసి వర్ల రామయ్య, బోండా ఉమ, ఆలపాటి రాజా సహా మరికొందరు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
క్యాసినోతో వందల కోట్ల జనం సొమ్మ కాజేసిన గడ్డం గ్యాంగ్ ను వదిలేసి నిజనిర్ధారణకు వెళ్లిన టీడీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడంపై లోకేశ్ ఫైర్ అయ్యారు. మహానుభావుల పురిటిగడ్డ గుడివాడను గడ్డం గ్యాంగ్ భ్రష్టుపట్టించిందని ఎద్దేవా చేశఆరు. మింగడానికి ఏమీ మిగలక చివరకు జనాల ఒంటిపై ఉన్న దుస్తులు సైతం లాగేసేందుకు క్యాసినో కల్చర్ తెచ్చారని దుయ్యబట్టారు. కే కన్వెన్షన్ జూదానికి అడ్డాగా మారిందని, ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలిసినా వైసీపీ రంగులతో కళ్లు మూసుకుపోయిన పోలీసులకు కనిపించలేదని లోకేశ్ విమర్శించారు.
టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణులు చేసిన దాడి దారుణమని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. టీడీపీ నేతలను గంజాయి బ్యాచ్ హత్య చేసేందుకు యత్నించారని ఆరోపించారు. గుడివాడను ఇప్పటికే మట్కా, వ్యసనాలకు కేంద్రంగా మార్చేశారని, ఇప్పుడు కేసినో గుట్టు బయటపడుతుందనే భయంతో గుడివాడ గుట్కా బ్యాచ్ వీరంగం వేసిందని మండిపడ్డారు. మంత్రి కొడాలి నాని కోడె త్రాచుగా మారారని… యువత జీవితాలను నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రివర్గం నుంచి కొడాలిని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.