సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సెటైర్లు వేశారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుల జాబితాలో నంబర్ వన్ గా ఉన్న జగన్..అవినీతి చేయడానికి వీల్లేదంటూ తన మంత్రులకు హుకుం జారీ చేయడం ఈ శతాబ్దంలోనే అతిపెద్ద జోక్ అని చురకలంటించారు. ఇకపై అవినీతి చేయొద్దంటే..గత మూడున్నరేళ్లుగా అవినీతి చేసినట్లేనా అని వ్యంగ్యంగా నిలదీశారు.
ఛార్లీ చాప్లిన్ తో పోటీ పడేలా జగన్ ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. రూ.43 వేల కోట్ల ప్రజాధనం దోపిడీ కేసులో 24 సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లు ఎదుర్కొటూ 16 నెలల జైలు శిక్ష అనుభవించిన జగన్ అవినీతి గురించి వేదాలు వల్లించడం హాస్యాస్పదమని పంచ్ లు వేశారు. తన ప్రమేయం లేకుండా అవినీతి చేయడానికి వీల్లేదనేలా వైసీపీ నేతలను జగన్ బెదిరిస్తున్నారని, అందులోనుంచి తన ‘రెడ్డి’ సలహాదారులను జగన్ మినహాయించారని ఎద్దేవా చేశారు.
గత మూడున్నరేళ్లలో అక్రమ మైనింగ్ లో ఏపీ దేశంలోనే అగ్ర స్థానంలో ఉందని, ఇసుక, బీచ్ శాండ్, లేటరైట్ పేరుతో ఏజెన్సీలో బాక్సైట్ అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. ఇక, రుషికొండను తవ్వ వద్దని కోర్టు చెప్పినా…వినకుండా ఆ కొండకు బోడిగుండు కొట్టారని విమర్శించారు. మద్య నిషేధం అంటూ ఏపీలోని మద్యం వ్యాపారం ద్వారా రూ.30 వేల కోట్లు కొల్లగొట్టారని, ఇళ్ల స్థలాల చదును పేరుతో చేసిన దోపిడీ సొమ్ము తాడేపల్లి ఖజానాకు చేరిందని ఆరోపించారు.
మూడు రాజధానులు అంటూ విశాఖలో జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి రూ.40 వేల కోట్ల విలువైన భూములను కబ్జా చేశారని అన్నారు. విశాఖ స్టీల్ ను బేరం పెట్టి వాటాలు పంచుకున్నారని, ఇప్పటికైనా కామెడీలు చేయడం అప్పులతో కుదేలైన ఖజానాను నింపే ప్రయత్నాలు చేయాలని యనమల హితవు పలికారు.