ఏపీలో దాదాపు గత రెండు సంవత్సరాలుగా అమరావతి రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అమరావతి నుంచి రాజధానిని తరలించాలన్న జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు, మహిళలు, యువతీయువకులు భారీ సంఖ్యలో ఉద్యమించారు. ఎండ, వాన, చలి, కరోనా వంటి వాటిని కూడా లెక్కచేయకుండా ఉద్యమాన్ని ముందుకు నడిపారు. అమరావతిపై జగన్ మనసు మారాలని తిరుమల వెంకన్ననూ మొక్కుకున్నారు.
అమరావతిలోని తుళ్లూరు నుంచి తిరుపతి వరకు ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరిట 45 రోజుల పాటు దాదాపు 450 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశారు. కరోనా ఆంక్షలు, పోలీసులతో ప్రభుత్వం కక్ష సాధింపులు భరిస్తూ ప్రతికూల పరిస్థితులలోనూ పాదయాత్ర కొనసాగించి విజయవంతం చేశారు. ఆ పాదయాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ, జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీలతో పాటు ఎన్నారైలు కూడా తమ మద్దతు తెలిపారు. ఎన్నారైలంతా అమరావతికి సంఘీభావంగా ఆన్ లైన్ ద్వారా ‘ఎన్నారైస్ ఫర్ అమరావతి’ నిరసన కార్యక్రమం కూడా చేపట్టారు.
ఇలా, కోట్లాది మంది తెలుగు ప్రజల గుండె చప్పుడుగా అమరావతి మారింది కాబట్టే..ఈ రోజు అమరావతిపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఏపీకి అమరావతే రాజధాని అని,హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే అమరావతే రాజధానిగా ఉండాలని అహోరాత్రులు పోరాడిన రైతుల విజయానికి గుర్తుగా వారి కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
టీడీపీ నేత వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో అమరావతి కోసం ఉద్యమించిన రైతులందరి పేరునా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజధాని రైతుల పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని శ్రీరామ్ ప్రసాద్ అన్నారు. కరోనా వంటి ప్రకృతి విపత్తులు అడ్డంకులు సృష్టించినా…ప్రభుత్వం కక్ష సాధించినా…మొక్కవోని దీక్షతో ముందుకు వెళ్లిన రైతులు భగవంతుడి ఆశీస్సులతో, చంద్రబాబు గారి ప్రోద్బలంతో ఉద్యమాన్ని ముందుకు నడిపి తమ అమరావతిని సాధించుకున్నారని ప్రశంసించారు.