ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు, జనసేనాని పవన్ కల్యాణ్ సహా పలువురు సెలబ్రిటీలు కరోనాబారిన పడి చికిత్స పొందుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా పలువురు నేతలు కరోనా బారిన పడడం కలవరపెడుతోంది. ఈ క్రమంలోనే టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి కూడా కరోనాబారిన పడి చికిత్స తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని తెలుస్తోంది. ఈ నెల 15న కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో సబ్బం హరి విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ముందుగా హోమ్ క్వారంటైన్ లో ఉన్న సబ్బం హరి లక్షణాలు తీవ్రతరం కావడంతో వైద్యుల సలహా ప్రకారం మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో, సబ్బం హరికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
గత మూడ్రోజులుగా సబ్బం హరి వెంటిలేటర్ పై ఉన్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. సబ్బం హరి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినట్టు తెలుస్తోంది. సబ్బం హరి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సబ్బం హరి ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ కార్యకర్తల్లో, సబ్బం హరి అభిమానుల్లో ఆందోళన ఏర్పడింది.