రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయని అంటారు. అలానే ఉంది.. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం. ఉమ్మడి ప్రకాశం జిల్లాపై 2019 ప్రారంభంలో ఉన్న పట్టు.. ఇప్పుడు బాగా తగ్గిపోయిందని అంటున్నారు పరిశీలకులు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు.. అధినాయకత్వం దగ్గర పలచనవడం వంటివి బాలినేనికి పూర్తిస్థాయిలో సెగ పెడుతున్నాయని చెబుతున్నారు. నియో జకవర్గం అభివృద్ధి ఎలా ? ఉన్నా.. రాజకీయంగా పట్టు సాధించేందుకు బాలినేని ఇంపార్టెన్స్ ఇచ్చారు.
ఇది.. రాజకీయంగానే కాకుండా.. ప్రజల పరంగా చూసుకున్నా.. బాలినేనికి ఇబ్బందులు సృష్టించింది. ఎంపీ మాగుంటకు టికెట్ కోసం.. పట్టుబట్టిన తీరుతో అధిష్టానం దగ్గర మార్కులు సగానికి సగం కోల్పోయా రని పార్టీలోనే చర్చగా మారింది. అధినేతను బట్టి.. నాయకులు నడుచుకోవాలనేది రాజకీయాల్లో చిన్న సూత్రం. కానీ, వైసీపీలోకి వచ్చేసరికి జగన్.. మాటను ఖాతరు చేసిన వారు అందలాల్లో ఉండగా.. ఆయనకు ఎదురు చెప్పిన వారి పరిస్థితి ఇబ్బందిగానే మారింది. ఈ కోవలోనే బాలినేని కూడా చేరిపోయారు.
సీఎం జగన్‌కు ఆయన నేరుగా ఎదురు చెప్పలేదు కానీ.. ఎంపీ మాగుంటకు వ్యతిరేకంగా పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఆయన కట్టుబడలేదు. ఇదే.. ఆయనకు బ్యాడ్ నేమ్ తీసుకువచ్చింది. పైగా.. పార్టీలో పట్టు కోల్పోయేలా.. నెమ్మదినెమ్మదిగా వ్యూహాలు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎక్కడో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని తీసుకువచ్చి.. ఒంగోలు పార్లమెంటు స్థానం ఇంచార్జ్‌గా నియమిం చడం.. ఆయనకే కందుకూరు, ఎర్రగొండపాలెం, సంతనూతల పాడు.. వంటి కీలమైన నియోజకవర్గాల బాధ్యత అప్పగించడం బాలినేనికి ఎఫెక్టేనని చెప్పారు.
ఆది నుంచి కూడా.. జిల్లాపై పట్టున్న బాలినేనికి ఇప్పుడు చెవిరెడ్డిని దింపడం ద్వారా పార్టీ అధిష్టానం గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. నిజానికి లోకల్‌గా తన మాటే నెగ్గాలని, తన మాటే వినాలనే రేంజ్లో బాలినేని వ్యూహాత్మకంగా ముందుకు కదిలారు. కొన్నాళ్లు ఇదే మాట చెల్లింది కూడా. కానీ, ఇప్పుడు మాగుంటకు అనుకూలంగా.. అంటే సీఎం జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించారో.. అప్పుడే.. బాలినేనికి దాదాపు చెక్ పెట్టేశారు.
గెలుపు పరిస్థితి ఏంటి..ఇక, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బాలినేనికి టికెట్ అయితే దక్కొచ్చు. కానీ, ఆయన వ్యక్తిగతంగా ఏమేరకు ఇక్కడ విజయం దక్కించుకుంటారనేది ప్రశ్నగా మారింది.
దీనికి కారణం..జిల్లాపై పట్టు కోల్పోవడంతో పాటు.. అభివృద్ధిని వదిలేసి రాజకీయాలకే పరిమితం కావడం. రెండున్నరేళ్లు మంత్రిగా ఉండే చాన్స్ వచ్చింది. నిజానికి రాష్ట్ర విభజన తర్వాత.. ఒంగోలు నుంచి మంత్రి అవకాశం బాలినేనికి దక్కడంతో ఇక్కడి ప్రజలు, ఇతర పార్టీల నాయకులు కూడా.. హర్షించారు. సుదీర్ఘ సమస్యలను ఆయన పరిష్కరిస్తారని అనుకున్నారు. కానీ, ఆయన వారి ఆశలను నెరవేర్చడంలో ఎలాంటి శ్రద్ధా చూపించలేక పోయారనే వాదన వుంది. ఇది ఇప్పుడు ఎన్నికలకు ముందు . ప్రత్యర్థి పార్టీలకు బలంగా, వరంగా కూడా మారనుంది. దీంతో గెలుపు గుర్రం ఎక్కడం అనేది అంత తేలిక కాదని అంటున్నారు పరిశీలకులు.
దామచర్ల ఫుల్ స్వింగ్…ఇక ఒంగోలు నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఈ సీటును ఆయనకే ఇస్తూ.. పార్టీ కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. 2014లో విజయం దక్కించుకున్న ఆయన ఒంగోలు కార్పోరేషన్‌ను అత్యద్భుతంగా తీర్చిదిద్ది.. కేంద్ర అవార్డును కూడా సొంతం చేసుకునేలా చేశారు. అప్పటికేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును మెప్పించి, నిధులు తీసుకురావడంలోనూ సక్సెస్ అయ్యారు. ఫలితంగా ఆయన హయాంలో ఇక్కడ వేసిన.. రోడ్డు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అదేవిధంగా మత్స్యకారులకు పీఎం ఆవాస్ యోజనను అప్పట్లోనే అమలు చేశారు. ఇవి గత ఏడాది పూర్తి చేస్తున్నాయి. ఇలా.. దామచర్ల అభివృద్ధే ఎటు చూసినా కనిపిస్తుండడం.. మరోవైపు.. జనసేనతో పొత్తు ఉండడం.. ఆయన గెలుపు 100 % రాసిపెట్టుకోవచ్చు.