ఏపీలో జగన్ పాలనపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో టీడీపీకి ఆదరణ పెరగడం, చంద్రబాబు సభలకు జనం పోటెత్తడంతో వైసీపీ నేతలకు నోట్లో వెలక్కాయ పడ్డట్లయింది. దీంతో, టీడీపీ నేతలు చేపట్టే కార్యక్రమాలను అడ్డుకోవడం, తద్వారా టీడీపీ మైలేజీని తగ్గించడమే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నారు. ఇందుకోసం పోలీసులను అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలను అడ్డుకోవడం, అరెస్టు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసుల జులుం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
చింతమనేని ప్రభాకర్ జన్మదినం సందర్భంగా ఏలూరు గవర్నమెంట్ హాస్పటల్ దగ్గర ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. అయితే, అదే ఆస్పత్రిలో కాపు నేత హరిరామజోగయ్య అడ్మిట్ అయి ఉన్నారు. దీంతో, ఆ రక్త దాన శిబిరాన్ని పరిశీలించేందుకు వెళ్లిన చింతమనేనిని పోలీసులు అడ్డుకున్నారు.
ఆస్పత్రి వద్ద నుంచి చింతమనేనిని పోలీసులు అడ్డుకొని అక్కడి నుంచి బలవంతంగా తరలించే ప్రయత్నంలో చింతమనేని చొక్కా చినిగింది. దీంతో, ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన చింతమనేని పోలీసులు తీరుపై మండిపడ్డారు. ఏం తప్పు చేశానని తన చొక్కా చింపివేశారంటూ ఫైర్ అయ్యారు. డీఎస్పీ సత్యనారాయణ తనతో దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమే తాన చేసిన తప్పా? అని ప్రశ్నించారు.
ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లడంతోనే ఇలా చేస్తోందని, తనపై 31 కేసులు పెట్టినా భయపడబోనని అన్నారు. ప్రభుత్వం అండ చూసుకొని అత్యుత్సాహం చూపించిన పోలీసులకు రిటర్న్ గిఫ్ట్ తప్పదని చింతమనేని హెచ్చరించారు.