గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని గుండ్లపాడు టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్య దారుణ హత్యకు గురయ్యారు. చంద్రయ్యను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నడిరోడ్డుపై గొంతు కోసి హత్య చేయడం పల్నాడులో కలకలం రేపింది. ఈ క్రమంలోనే ఈ ఘటనపై టీడీసీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైసీపీ అరాచక పాలనలో ఎంతో మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని మండిపడ్డారు. ఒక్క పల్నాడులోనే పదుల సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తల హత్యలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రయ్య కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
జగన్ పాలనపై జనం తిరగబడుతున్నారని, జనాన్ని భయపెట్టేందుకే వైసీపీ నేతలు హత్యా రాజకీయాలకు తెర తీశారని ఆరోపించారు. దాడులు చేసేవారికే పదవులిచ్చే విష సంస్కృతికి జగన్ బీజం వేశారని ఫైర్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బోండా ఉమా, బుద్ధా వెంకన్నలపై వైసీపీ వర్గీయులు హత్యాయత్నం చేశారని, పోలీసులు నాడే చర్యలు తీసుకుని ఉంటే వైసీపీ బరితెగింపులు ఆగేవని అన్నారు.
ఇక, హత్యా రాజకీయాల వారసుడు జగన్ అని, జగన్ సీఎం కావడంతో ప్రజలకు, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ప్రశ్నించే వారిపై దాడి చేయడం, పోరాడే వారిని అంతమొందించడం అలవాటుగా మారిందన్నారు.
ఈ ఘోరానికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. అరాచకం రాజ్యమేలుతున్న మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంతత కోసం అందరూ ఒక్కటై పోరాడాలని, చంద్రయ్య కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని లోకేశ్ తెలిపారు.
తోట చంద్రయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. పట్టపగలే నడిరోడ్డుపై గొంతు కోయడం అధికారపార్టీ నేతల దుర్మార్గాలకు పరాకాష్ట అని, ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం, పోరాడుతున్న నేతలను అంతమొందించడం మీ ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనం కాదా? జగన్ అని నిలదీశారు.