ఏపీ మాజీ ముఖ్యంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తాజాగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుడమేరు వరదలను అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వం వందల కోట్లు వెనకేసుకుందంటూ జగన్ అండ్ బ్యాచ్ అసత్య ప్రచారం చేయడాన్ని బుద్దా వెంకన్న తప్పుబట్టారు. మంగళవారం మీడియాతో బుద్దా మాట్లాడుతూ.. వరదల టైమ్ లో ఇంటింటికీ ఆహారం, మంచినీరు అందిస్తూ చంద్రబాబు ప్రజలను ఆదుకున్న తీరు దేశానికే ఆదర్శమని ప్రశంసలు కురిపించారు.
చంద్రబాబు వల్లే వరదల నుంచి త్వరగా బయట పడ్డామని ప్రజలు గొప్పగా చెబుతుంటే వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. వరదలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేశారని ఆరోపణలు చేయగానికి సిగ్గుండాలిని బుద్దా ఫైర్ అయ్యారు. ప్రజలు వరదల్లో అల్లాడిపోతే ఏసీ గదిలో కూర్చున్న వ్యక్తి మాజీ సీఎం వైఎస్ జగన్ అయితే.. విపత్తు ఎప్పుడు వచ్చినా నేనున్నా అని ప్రజలతో ఉండే వ్యక్తి చంద్రబాబు అని.. అదే ఇద్దరికీ ఉన్న తేడా అని బుద్దా అన్నారు.
అవినీతికి ఆస్కారం లేకుండా కూటమి సర్కార్ సహాయక చర్యలు చేపట్టిందని.. దమ్ముంటే వరదల్లో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలంటూ బుద్దా ఛాలెంజ్ విసిరారు. అసత్యాలు, అబద్దాలు ప్రచారం చేసే వైసీపీ నేతలు అడ్రెస్ లేకుండా పోయారని.. మళ్లీ చేస్తే వైసీపీ భూస్థాపితం కావడం ఖాయమని ఎద్దేవ చేశారు. వరదల టైమ్ లో కోటి రూపాయలు ప్రకటించిన వైఎస్ జగన్.. ఆ విరాళాన్ని ఎవరికి ఖర్చు పెట్టారు? అని బుద్దా ప్రశ్నించారు. సిగ్గుంటే ఇప్పుడు అయినా ప్రజలకు సేవ చేయడం అలవాటు చేసుకో.. కుట్ర, కుళ్లు రాజకీయాలు మానుకో జగన్ అంటూ మాజీ సీఎంకు బుద్దా సూచన చేశారు.