టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు… విజయవాడకు చెందిన బీసీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం వెల్లడయ్యే ఫలితాల్లో కూటమి ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. ఇదేసమ యంలో ఆయన సవాల్ రువ్వారు. వైసీపీనే మరోసారి అధికారంలోకి వస్తుందని పదే పదే చెబుతున్న ఆరా మస్తాన్ సర్వేపై విమర్శలు గుప్పించారు. “కూటమి అధికారంలోకి రాకపోతే.. నేను నాలుక కోసుకుంటా. వైసీపీ అధికారంలోకి రాకపోతే.. నువ్వు కూడా నాలుక కోసుకుంటావా!“ అని ఆయన ఆరా మస్తాన్‌కు సవాల్ రువ్వారు.
ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాబోతుందని అనేక సర్వేలు చెప్పాయని బుద్ధా వెంకన్న అన్నారు. కానీ, ఎక్కడో వైసీపీ సొమ్ము తిన్న కొందరు మాత్రం కూటమికి వ్యతిరేకంగా సర్వేల పేరుతో తాడేపల్లి ఇచ్చిన అంకెలు వల్లెవేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో కూటమి అధికారంలోకి రాకపోతే తన నాలుక కోసుకుంటానని అన్నారు. ఆరా మస్తాన్ ఇచ్చిన సర్వే అంతా నకిలీ సర్వే.. తాడేపల్లి సర్వే అంటూ.. వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు చెప్పినట్టు చివరి నిముషంలో అంకెలు మార్చేశారని మస్తాన్‌పై విమర్శలు గుప్పించారు.
ఎన్నికల్లో ఓటమికి రెడీ అయిన వైసీపీ.. నకిలీ సర్వేలు.. నకిలీ ఎగ్జిట్ పోల్స్‌తో కాలం గడుపుతూ.. ప్రజల ను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఇలాంటి సర్వేలను ప్రజలు నమ్మబోరని తెలిపారు. రాష్ట్రంలో ఏర్పడేది.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమేనని.. మంగళవారం ఈ విషయం అందరికీ తెలుస్తుందని అన్నారు. అయితే… ఆరా మస్తాన్ చెప్పింది నిజమైతే.. తన సవాల్‌ను స్వీకరించాలని అన్నారు. కూటమి రాకపోతే.. తాను నాలుక కోసుకునేందుకు సిద్ధమని బుద్ధా వెంకన్న అన్నారు. ఇదేసమయంలో వైసీపీ రాకపోతే.. మస్తాన్ కూడా నాలుక కోసుకోవాలని సవాల్ రువ్వారు. మరి దీనిపై మస్తాన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.