టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలు భూకబ్జాలకు పాల్పడ్డారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. చవక ధరకు భూములు కొని…దాని చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని టీడీపీ ప్రభుత్వ హయాంలో క్రమబద్ధీకరించుకున్నారని ఆరోపించారు. ఆ భూములన్నీ వైసీపీ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని, ఎన్సీసీ భూముల కేటాయింపు వైసీపీ హయాంలో జరగలేదని చెప్పారు. వైసీపీకి, జగన్ కు, తనకు, తన కుటుంబ సభ్యుల ప్రతిష్టకు భంగం కలిగించేలా రుషికొండ భూకబ్జాల పేరిట ఓ వర్గం మీడియా, టీడీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని, దానిపై పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశానని అన్నారు.
ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డికి టీడీపీ కీలక నేత బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు. విజయసాయిరెడ్డి దోచుకున్న భూములన్నీ సర్వే నంబర్లతో సహా నిరూపిస్తానని, విశాఖలోని జగదాంబ సెంటర్ లో ఏప్రిల్ 21న బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. సర్వే నెంబర్లతో సహా వైజాగ్ పార్టీ ఆఫీసులో నిజాలు వెల్లడిస్తానని, దమ్ముంటే తనను ఆపాలంటూ సాయిరెడ్డికి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డిపై వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరాంధ్రకు మంత్రి అని ఫీలవుతున్న విజయసాయిరెడ్డి…ఆ ప్రాంతానికి శనిలా దాపురించాడని వెంకన్న ఆరోపించారు. విజయసాయిరెడ్డి గజదొంగ, నరరూప రాక్షసుడు, విదేశాల్లో అయితే విజయసాయిని బహిరంగంగా ఉరి వేసేవారంటూ బుద్దా వెంకన్న తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. వైజాగ్ ను విజయసాయి దోచుకుంటున్నారని, ఉత్తరాంధ్రలో భూములను బినామీలతో కాజేస్తున్నాడని ఆరోపించారు. రూ.1500 కోట్ల విలువైన ఎన్సిసి భూములను రూ.200 కోట్ల రూపాయలకే బినామీలతో దోచేశాడని ఆరోపించారు. విజయసాయి డబ్బులు మాత్రమే తింటున్నాడంటూ సంచలన విమర్శలు చేశారు.
ఉత్తరాంధ్రలో వీజే ట్యాక్స్ వేస్తున్న సాయిరెడ్డిని చూసి రాష్ట్రమంతా వణికిపోతున్నారని దుయ్యబట్టారు. ఇంటిలిజెన్స్ ఎస్పీ స్థలాన్ని సైతం వైజాగ్ ఎంపీ దోచుకున్నాడని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం రాగానే ఉత్తరాంధ్ర ప్రజలు విజయసాయిరెడ్డికి దేహశుద్ధి చేయటం ఖాయమని జోస్యం చెప్పారు. బొత్స సత్యనారాయణను డమ్మీని చేసీ.. ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రిగా ఏ2 సాయిరెడ్డి వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. 16 నెలలపాటు జగన్, సాయిరెడ్డిలు జైలులో క్లాస్ మేట్స్ అని, అందుకే సమానంగా పంచుకుంటున్నారని ఆరోపించారు.
విజయసాయి రెడ్డి నువ్వు దోచుకున్న భూములన్నీ సర్వే నంబర్లతో సహ ఏప్రిల్ 21 న విశాఖలోనే నిరూపిస్తా.. దమ్ముంటే ఆపు .. @VSReddy_MP pic.twitter.com/prhdwJ1lFj
— Budda Venkanna (@BuddaVenkanna) April 9, 2022