సీఎం జగన్ పాలనపై టీడీపీ సీనియర్ నేత బీటెక్ రవి కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు కూడా పులివెందుల టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టిన రవి…ఎంపీ అవినాష్ రెడ్డిని విమర్శించారు. రైతులు కరువుతో ఇబ్బందుల్లో ఉంటే అవినాష్ రెడ్డి ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. ఇక, టీడీపీ కార్యకర్తలను పోలీసులు రౌడీ షీటర్ల మాదిరి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. అయితే, అనూహ్యంగా ఆ విమర్శలు చేసిన తర్వాత బీటెక్ రవి కిడ్నాప్ కు గురి కావడం పులివెందులలో సంచలనం రేపింది.
కడప నుంచి పులివెందుల వస్తున్న బీటెక్ రవిని 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో రవి భార్య ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా…రవి గురించి తమకే సమాచారం లేదని పోలీసులు చేతులెత్తేయడం షాకింగ్ గా మారింది. రవిని అధికార పార్టీ నేతలు కిడ్నాప్ చేశారని పుకార్లు వస్తున్నాయి. దీంతో, హెబియస్ కార్పస్ పిటిషన్ వేసే ఆలోచనలో కుటుంబసభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది.