గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో ఉన్మాది చేతిలో అనూష అనే యువతి బలైన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ నేత నారా లోకేష్ రేపు నరసరావుపేటకు వెళ్లబోతున్నారు. ఈ క్రమంలోనే నారా లోకేష్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. అయితే, ఎవరు అడ్డుకున్నా సరే రేపు కచ్చితంగా నరసరావుపేటలో పర్యటిస్తానని లోకేష్ , టీడీపీ నేతలు శపథం చేశారు.
దీంతో, పల్నాడు ప్రాంతంలోని నరసరావుపేటలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. లోకేష్ పర్యటన నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని టీడీపీ కీలక నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. సత్తెనపల్లిలో టీడీపీ నేత కోడెల శివరాంను హౌస్ అరెస్ట్ చేయంగా…నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని గ్రామ స్దాయి నేతలకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నిపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి చిన్నపాలేరులా విశాల్ గున్ని మాట్లాడడం ఐపీఎస్కే కళంకమని అయ్యన్న షాకింగ్ కామెంట్లు చేశారు. విశాల్ గున్నీకి అంత సరదాగా ఉంటే ఖాకీ యూనిఫాం తీసేసి వైసీపీ కండువా కప్పుకోవాలని అయ్యన్న ఎద్దేవా చేశారు.
లోకేష్ పర్యటనకు పోలీసులు అనుమతించకపోవడంపై టీడీపీ నేత నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించడం తప్పా? అని ప్రశ్నించారు. తాము ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామో, పోలీసు రాజ్యంలో ఉన్నామో అర్థమవటంలేదరన్నారు. టీడీపీ హయాంలో తాము ఇలాగే చేసుంటే జగన్ పాదయాత్ర చేయగలిగేవాడా? అని ప్రశ్నించారు. త్వరలోనే వైసీపీకి ప్రతిపక్ష పాత్ర తప్పదని ఆనందబాబు జోస్యం చెప్పారు.