రాజకీయాలన్న తర్వాత అధికార, విపక్ష నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. ఏదైనా వ్యవహారంలో విపక్ష నేతలను ఇరికించే అవకాశం ఏమాత్రం ఉన్నా అధికార పక్షం దానిని అస్సలు వదులుకోదు. ఎలాగైనా ప్రత్యర్థులను ఇరుకున్నపెట్టాలన్న ఉద్దేశ్యంతో ఏదో ఒక కేసులో వారి పేర్లను ఇరికించేసి ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు. అయితే, ఈ క్రమంలో కొన్ని సార్లు అధికార పక్ష నేతలు కనీస లాజిక్ ను కూడా మిస్సవుతుంటారు. తాజాగా, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విషయంలోనూ అధికార పక్షం ఎన్నో లాజిక్ లను మిస్సయిందన్న ప్రచారం జరుగుతోంది. అచ్చెన్నకు ఏమాత్రం సంబంధం లేని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నంది విగ్రహం కేసులో ఆయనను ఇరికించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంలో తనేమాత్రం సంబంధం లేదని లాజిక్ లతో సహా అచ్చెన్నాయుడు వెల్లడించిన వైనం చర్చనీయాంశమైంది.
ఆ కేసులో డీఎస్పీకి అచ్చెన్న తన వివరణ తెలియజేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు, తనకు ఏమిటి సంబంధం అని అచ్చెన్న పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడున్న కమిటీ నందికి పూజ చేసి దిమ్మె మీద పెడితే వారిపై కేసు నమోదు చేశారని అన్నారు. దిమ్మెను పగులగొట్టి, దానిపై ఉన్న నందిని తొలగించి దేవుడికి అపచారం చేసిన వారిపై కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు. పోలీసులకైనా జ్ఞానం ఉండాలని, ఎక్కడైనా రెండు మతాలవారి మధ్య గొడవ జరిగితే అప్పుడు హిందూమతానికి అపచారం జరుగుతుందని అన్నారు. అక్కడున్నవాళ్లంతా హిందువులే అయితే హిందూ మతానికి అపచారం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. మతాల మధ్య గొడవ అని, కులాల మధ్య వివాదం అని కేసు పెట్టడాన్ని ఖండించారు. మరి, ఈ నంది విగ్రహం కేసులో అచ్చెన్న లాజికల్ గా అడిగిన ప్రశ్నలకు పోలీసులు ఏం సమాధానమిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయినా, అచ్చెన్నపై ప్రభుత్వం కక్ష సాధించాలనుకుంటే…అందుకు పోలీసులు సహకరిస్తుంటే లాజిక్కులతో పనేముందని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.