సీఎం జగన్ పై విజయవాడలోని సింగ్ నగర్ రోడ్ షో సందర్భంగా రాయి దాడి జరిగిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కొందరు ప్రతిపక్ష నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. వైసీపీ నేతలు మాత్రం జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూడలేకే ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ఘటనపై టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆనం పలు సందేహాలను లేవనెత్తారు.
ఒకే రాయి మూడు గాయాలు ఎలా చేస్తుందని ఆనం సూటిగా ప్రశ్నించారు. సీఎం జగన్ కంటికి గాయం చేసిన అదే రాయి ఆ పక్కనే ఉన్న వెల్లంపల్లి కంటికి కూడా గాయం చేసి ఆ తర్వాత జగన్ కాలుపై పడి ఆయన కాలుకు కూడా గాయం చేసిందని ఆనం ఎద్దేవా చేశారు. జగన్ కాలికి గాయం అయిన విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. జగన్ కాలికి బ్యాండేజ్ కట్టిన ఫోటోలను కూడా ఆనం ప్రదర్శించారు. నిన్నటి ఘటన సందర్భంగా జగన్ అద్భుతంగా నటించారని సెటైర్లు వేశారు.
ఇక, రాత్రి 8.10 కి ఘటన జరిగితే 8.13 కే సోషల్ మీడియాలో స్క్రోలింగ్ వస్తుందని, 8.15కు ఇంటింటికి వాలంటీర్లు వెళ్లి జగన్ పై హత్యాయత్నం జరిగిందని ప్రచారం చేశారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటన డ్రామా అని, రాత్రి 7 గంటలకు కరెంటు పోయిందని గుర్తు చేశారు. గాల్లో ఉన్న డ్రోన్లు కిందకు దిగిపోయాయని, పక్కా స్కెచ్ తో జరిగిన ఈ దాడి ఘటనలో పోలీసుల పాత్ర కూడా ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సీఎం ర్యాలీలో కరెంటు ఉండదా? డ్రోన్ విజువల్స్ ఎందుకు లేవు? అని ఆనం ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం అయిందని, ఆ భయంతోనే ఇటువంటి డ్రామాలకు తెరలేపారని విమర్శలు గుప్పించారు.