కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో అధికార పార్టీ వైసీపీలో అంతర్గత విభేదాలు.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కలిసివ చ్చాయని అంటున్నారు పరిశీలకులు. పిట్టపోరు.. పిట్ట పోరు .. పిల్లి తీర్చినట్టుగా.. ఎస్సీ వర్గానికి రిజర్వేషన్ చేసిన ఈ నియోజక వర్గంలో వైసీపీ నేతల మధ్య కొన్నాళ్లుగా వివాదాలు జరుగుతున్నాయి.
ఎమ్మెల్యే సుధాకర్‌కు, పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ హర్షారెడ్డికి మధ్య ఉప్పు నిప్పుగా పరిస్థితులు మారిపోయాయి. ఎమ్మెల్యేపై ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తూ.. హర్షారెడ్డి అన్నీతానై వ్యవహరిస్తుండడం గమనార్హం. ఎన్నికల్లో సుధాకర్ గెలుపునకు తానే కృషి చేశానని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సుధాకర్‌పై హర్షారెడ్డి పెత్తనం చేస్తున్నారనే వాదన కొన్నాళ్లుగా ఉంది. ఇక, ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించుకున్నారు. అయితే.. ఈ ప్రయత్నం వికటించి.. పరోక్షంగా.. ప్రత్యక్షంగా కూడా.. టీడీపీకి మేలు చేయడం గమనార్హం.
కోడుమూరు మేజర్ గ్రామపంచాయతీలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఇక్కడ వైసీపీ ఇంచార్జ్ హర్షారెడ్డి బలపర్చిన అభ్యర్థి కె.శారదమ్మపై టీడీపీ మద్దతురాలు అభ్యర్థి భాగ్యరత్న 672 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. కోడుమూరులో 19,204 మంది ఓటర్లు ఉండగా 13,780 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
టీడీపీ మద్దతు అభ్యర్థి భాగ్యరత్నకు 6153 ఓట్లు, హర్షారెడ్డి మద్దతుతో పోటీ చేసిన కె.శారదమ్మకు 5481 ఓట్లు, ఎమ్మెల్యే సుధాకర్ మద్దతుతో పోటీ చేసిన సుశీలకు 1,137 ఓట్లు, బీజేపీ మద్దతుతో పోటీ చేసిన ఉమామహేశ్వరమ్మకు 124 ఓట్లు పోలయ్యాయి. 885 మంది నోటాకు ఓటు వేశారు.
పట్టణంలో 20 వార్డులు ఉండగా.. వైసీపీ మద్దతుదారులు 12, టీడీపీ మద్దతుదారులు 6 గెలుచుకున్నారు. అయితే.. ఈ విధంగా టీడీపీ లాభపడడానికి వైసీపీ నేతల ఆధిపత్య పోరుకారణమని స్పష్టంగా తెలుస్తోంది. ఇటు ఎమ్మెల్యే, అటు ఇంచార్జ్ ఇద్దరూ ఒకే పంచాయతీ నుంచి ఇద్దరికి మద్దతు ప్రకటించారు. దీంతో ఓట్లు చీలి.. టీడీపీ మద్దతు అభ్యర్థి విజయం దక్కించుకోవడం గమనార్హం. మరి ఇప్పటికైనా.. ఈ నేతల మధ్య సయోధ్య కుదురుతుందా? లేదా.. వచ్చే ఎన్నికల్లోనూ ఇలానే చేసుకుంటారో.. చూడాలి.