అనుకున్నట్లే ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్ మారిపోయింది. ఎలాగైనా జగన్‌ను ఓడించాలన్న కసితో ఉన్న టీడీపీ, జనసేనలు పెద్దన్న బీజేపీని కూడా తమతో కలుపుకోవడంలో సక్సెస్ అయ్యాయి.
రెండు రోజులుగా దిల్లీలో క్యాంప్ వేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు శుక్రవారం రాత్రి ఒకసారి, శనివారం మరోసారి అమిత్ షాతో భేటీ అయినాక పొత్తుల ప్రకటన బయటకొచ్చింది.
శనివారం 50 నిమిషాల పాటు చంద్రబాబు, పవన్, అమిత్ షా మధ్య జరిగిన చర్చల అనంతరం మూడు పార్టీల పొత్తుకు అంగీకారం కుదిరినట్లు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి.
ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉండగా ఇప్పుడు వాటికి బీజేపీ కలిసింది.
కాగా ఈ పొత్తుల విషయాన్ని టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ ప్రకటించారు.
సాయంత్రం అధికారికంగా పొత్తులపై ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు, 3 లోక్ సభ సీట్లు కేటాయించగా ఇప్పుడు బీజేపీ కూడా కొన్ని సీట్లు కేటాయించబోతున్నారు.
బీజేపీకి ఎన్ని సీట్లు అనేది అధికారికంగా ఇంకా ప్రకటన రానప్పటికీ జనసేన బీజేపీ కలిసి 30 అసెంబ్లీ.. 8 లోక్ సభ సీట్లకు పోటీ చేస్తాయని తెలుస్తోంది.
జనసేన ఇప్పుడున్నట్లే 24 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయనుండగా బీజేపీ 6 అసెంబ్లీ సీట్లకు పోటీ చేయనుంది.. లోక్ సభ సీట్లు 6 చోట్ల బీజేపీ పోటీ చేయనుంది. జనసేన ముందు అనుకున్న కంటే ఒక సీటు తగ్గించుకుని రెండు లోక్ సభ సీట్లకు పరిమితం కానుందని సమాచారం.
దీనిపై ఈరోజు సాయంత్రం పూర్తి వివరాలు వెలువడనున్నాయి.