టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం యాత్రలు, సభలకు విశేష స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన సభలు విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రజాగళం అని పిలుపునిస్తే జన సముద్రం ఆవిష్కృతమైందని, ప్రజలు కదం తొక్కుతున్నారని అన్నారు. శ్రీకాకుళంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా చంద్రబాబు ఆసక్తికర కామెంట్లు చేశారు. టీడీపీ మహిళలకు పుట్టినిల్లని, తాను మొదటి నుంచి మహిళా పక్షపాతిని అని అన్నారు. మీ కుటుంబాలకు పెద్దకొడుకులా సేవ చేస్తానని, ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని దుయ్యబట్టారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడిన జలగ.. సైకో జగన్ అని ధ్వజమెత్తారు. నిత్యావసరాలు సహా అన్నింటి ధరలు పెంచేశాడని, మీ జీవితాలను తలకిందులు చేసిన దద్దమ్మ ప్రభుత్వమిది అని నిప్పులు చెరిగారు.
అంతకుముందు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢమా బుస్సు నేత తమ్మినేని పనైపోయిందని, ఆయన ఆటలు, వేషాలు, డ్రామాలు 19 రోజుల్లో ముగిసిపోతాయని చురకలంటించారు. మనం కొట్టే దెబ్బకు ఈ ఢమా బుస్సు ఎమ్మెల్యే ఒడిశాకు పారిపోతాడని, కానీ, పారిపోయినా పట్టుకొచ్చి చేసిన పాపాలు, తప్పులు వెంటాడేలా చేస్తానని హెచ్చరించారు. తమ్మినేని వ్యక్తిని ప్రజాకోర్టులో శిక్షించాలని, అతడు చేసినవి ఒకటి కాదు, రెండు కాదు…అని, స్పీకర్ పదవికి ఆయన అనర్హుడని విమర్శించారు. ఒక అసమర్థ స్పీకర్ ముఖ్యమంత్రి ఏం చెబితే అది చేశాడని, అతడొక సైకో… ఇతడు కూడా ఒక సైకోలా తయారయ్యాడని ఎద్దేవా చేశారు. అసెంబ్లీని అప్రదిష్ట పాల్జేసిన దుర్మార్గుడు ఈ ఢమా బుస్సు ఎమ్మెల్యే అని తమ్మినేనిపై విరుచుకుపడ్డారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత పనికిమాలిన దద్దమ్మను ఎన్నడూ చూడలేదని, గౌరవం లేని వ్యక్తి… పూర్తిగా అవినీతిపరుడు అని చురకలంటించారు.
ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేశాడు. రూ.13 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఎవరు కడతారు ఈ డబ్బు? జగన్ మోహన్ రెడ్డి కడతాడా? రేపు ఓడిపోతే ఉంటాడా? మళ్లీ దొరుకుతాడా? ఎవరు కట్టాలి ఈ అప్పులు? పన్నుల రూపంలో ప్రజలే కట్టాలి కదా! మరి ప్రజల్లో ఇంకా చైతన్యం రాలేదు, కోపం రాలేదు. ఒక్కో కుటుంబంపై రూ.10 లక్షల అప్పు చేసిన దుర్మార్గుడ్ని వదిలిపెడతారా? అని ధ్వజమెత్తారు. కూటమికి 175కి 175 స్థానాలు వస్తాయి… వై నాట్ పులివెందుల? పులివెందులలో ఏమని అడుగతావు ఓటు? గొడ్డలి చూపించి బెదిరిస్తావా?” అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.