ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత టీడీపీ నేతలపై దాడులు, కక్షసాధింపు చర్యలు ఎక్కువయ్యాయన్న విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబుపై కక్షతో ప్రజావేదిక కూల్చివేతతో ఈ ఎపిసోడ్ ను మొదలుపెట్టిన జగన్….తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌కి చెందిన బిల్డింగ్ కూల్చివేతతో కొనసాగిస్తున్నారు.
నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణం జరిపారంటూ జీవీఎంసీ అధికారులు విశాఖలో శ్రీనివాస్ కు చెందిన బిల్డింగ్‌ను కూల్చివేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ కూల్చివేత నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రాత్రికి రాత్రే నోటీసులివ్వకుండా నిర్మాణాన్ని తొలగించడం అన్యాయమని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీలోకి రావాలని తనను విజయసాయిరెడ్డి ఆహ్వానించారని, తాను అంగీకరించకపోవడంతోనే తన భవనాన్ని కూల్చివేశారని ఆరోపించారు. అన్ని అనుమతులన్నా కావాలనే అధికారులు విజయసాయి ప్రోద్బలంతో బిల్డింగ్ కూల్చారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో జగన్ ధోరణిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో జగన్ ను విమర్శించిన మాజీ ఎంపీ, టీడీపీ నేత సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడ కూడా అక్రమ కట్టడం అంటూ కూల్చివేశారని, విశాఖలో అక్రమకట్టడాలంటే టీడీపీ నేతలవేనని టీడీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ నేతలను టార్గెట్ చేయాలనుకున్న జగన్ అక్రమ కట్టడాలంటూ ఏదో కుంటిసాకు అడ్డుపెట్టుకోవడం ఎందుకున్న వాదనలు వినిపిస్తున్నాయి.
విశాఖలో ఎన్నో అక్రమ కట్టడాలున్నప్పటికీ కేవలం టీడీపీ నేతల కట్టడాలే జీవీఎంసీ అధికారులకు కనిపిస్తున్నాయంటూ విమర్శలు వస్తున్నాయి. డైరెక్ట్గ్ గా టీడీపీ నేతల ఆస్తులే తన టార్గెట్ అని జగన్ చెప్పవచ్చు కదా అని టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.