టీడీపీ మాజీ మంత్రి, విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ గెలుపు తథ్యమా? ఆయన ఈ దఫా అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమై పోయిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇదే విషయాన్ని టీడీపీ నేతలు కూడా చెబుతున్నారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఒకటి సింపతీ, రెండు.. విద్యావంతుడు, స్థానికంగా.. ఆయనకు ఉన్న ఇమేజే కారణాలని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.
సింపతీ పరంగా చూసుకుంటే.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. నారాయణపై రెండు ప్రదాన కేసులు నమోదు చేసింది. ఒకటి.. పదోతరగతి పేపర్ లీకేజీకి సంబంధించిన వ్యవహారం. అదేవిధంగా రెండోది.. అమరావతి రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసు. ఈ రెండు కేసులు కూడా తనపై ఉద్దేశ పూర్వకంగా పెట్టారని.. వీటిలో ఏమాత్రం నిజం లేదని.. నారాయణ చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన పార్టీలోనూ.. ప్రజల్లోకి కూడా బలంగా తీసుకువెళ్లారు. ఇది బాగానే వర్కవుట్ అవుతోందని అంటున్నారు.
ఇక, మరోకోణం.. 2019 ఎన్నికల్లో నారాయణను నెల్లూరు సిటీ ప్రజలు ఓడించారు. అయినప్పటికీ.. ఇక్కడ ఆయన తన సొంత నిధులతో అభివృద్ది కార్యక్రమాలు చేయించారు. అదేవిధంగా తన విద్యాసంస్థల్లో 100 మంది పేదలకు విద్యను అందిస్తున్నారు. ఈ రెండు కూడా.. ఆయనపై సింపతీ చూపిస్తున్నాయి. మరో వైపు.. నారాయణ సతీమణి.. రమాదేవి ఇంటింటికీ తిరుగుతున్నారు. ఇది మహిళా సెంటిమెంటును మరింతగా నారాయణ వైపు వచ్చేలా చేస్తోంది. ఇలా.. సెంటిమెంటు ఓవైపు పనిచేస్తోంది.
మరోవైపు.. పార్టీపరంగా చూసుకుంటే.. నారాయణకు శత్రువులు లేరు. పైగా పోటీ కూడా లేదు. దీంతో కేడర్ అంతా.. ఆయన వెంటే నడిచేందుకు ఇది దోహదపడుతోంది. ఉత్తమ నాయకుడుగా ప్రొజెక్టు చేసుకునే అవకాశం లభించింది. ఎన్నికల వేళ.. ఇది నారాయణకు కలిసి రానుంది. ఇక, జనసేనతో ఉన్న మిత్రపక్షం.. వైసీపీ చేసిన మార్పు కూడా.. నారాయణకు కలిసి రానుందనే అంచనాలు వస్తున్నాయి. సో.. ఎలా చూసుకున్నా.. నారాయణ ఈ సారి గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.