మరో మూడు నెల్లలో ఎన్నికలు ఉన్నాయి. పైగా.. వచ్చే ఎన్నికలు అంత ఈజీ అయితే కాదు. చాలా సీరియస్‌గానే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బలమైన నియోజకవర్గాలు, మంచి పట్టున్న జిల్లాలపై దృష్టి పెట్టడం ద్వారా పార్టీలు మేజిక్ ఫిగర్‌ను చేరుకునేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కి మెరుగైన అవకాశం ఉన్న జిల్లాల జాబితాలో శ్రీసత్యసాయి జిల్లా చేరింది.
ఈ సత్యసాయి జిల్లాలో టీడీపీ కొంచెం కష్టపడితే.. గుండుగుత్తగా మొత్తం అసెంబ్లీ స్థానాలను తన ఖాతా లో వేసుకునేందుకు అవకాశం ఉంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ జిల్లాలో మొత్తం 6 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఒక్క హిందూపురంలో మాత్రమే టీడీపీ గత ఎన్నికల్లో విజయం దక్కించుకుంది. మిగిలిన ఐదు చోట్లా వైసీపీ విజయ దుందుభి మోగించింది. అలాగని టీడీపీ అసలు లేకుండా పోలేదు.
కొన్ని నియోజకవర్గాల్లో స్వల్ప మెజారిటీతోనే టీడీపీ సీటును పోగొట్టుకుంది. ఈ క్రమంలో ఆయా నియోజ కవర్గాల్లో టీడీపీ కొంచెం కష్టపడితే.. విజయం సాధించడం సాధ్యమేనని అంటున్నారు పరిశీలకులు. మడకశిర, పెనుకొండల్లో టీడీపీ గెలుపు పక్కా అనేది స్థానిక నాయకుల మాట. ఇక్కడ వైసీపీ లో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు, నాన్ లోకల్ వివాదం వంటివి టీడీపీకి కలిసి వస్తాయని చెబుతున్నారు. ఇక, హిందూపురంలో ఈ సారి కూడా బాలయ్యదే గెలుపని నిర్ణయానికి వచ్చేశారు.
ఇక, పుట్టపర్తిలో సొంత కుంపట్లను ఆర్పుకొని.. నాయకులను నయానో భయానో.. లైన్లో పెట్టుకుంటే.. ఇది టీడీపీ ఖాతాలోనే పడుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ధర్మవరంbలోనూ సునాయాసంగా సైకిల్ తిరుగుతుందని అంటున్నారు. ఇక, కదిరిలో ఈ దఫా కందికుంట ప్రసాద్ గెలుపు కాయమనే అంచనాలు వస్తున్నాయి. ఇప్పటికే ఓటమి కారణంగా ఆయనపై ఏర్పడిన సానుభూతి ఓట్లు కురిపిస్తుందని చెబుతున్నారు.