ఒక అనుభవం.. అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుందని అంటారు. ఒకసారి ఎదురు దెబ్బతగిలితే.. దాని నుంచి నేర్చుకున్న పాఠం.. అనేక సమస్యలకు పనిచేస్తుందని చెబుతారు. ఇక, రాజకీయాల్లో అయినా.. ఇదే ఫార్ములా వర్తిస్తుంది. గతంలో ఎదురైన సమస్యలను తమకు ఆలంబనగా చేసుకుని పార్టీల నేతలు ముందుకు సాగుతారు. అయితే.. ఘనత వహించిన ఏపీ ప్రతిపక్షం టీడీపీ మాత్రం.. దీనికి భిన్నంగా తప్పులపై తప్పులు చేస్తూనే ఉంది. తప్పులపై తప్పులను తమ్ముళ్లపై రుద్దుతూనే ఉంది.
ఇటీవల స్థానిక ఎన్నికలు జరిగాయి. ఇంకేముంది.. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కనుక.. తాము.. గెలిచితీరుతామని.. టీడీపీ నాయకులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే పాతతరం నేతలకు జిల్లాల్లో బాధ్య తలు అప్పగించారు. అయితే.. అదే సమయంలో అప్పటికే నియమించిన పార్లమెంటరీ పార్టీ జిల్లాల అధ్యక్షులకు ఎక్కడా ఎవరికీ బాధ్యతలు అప్పగించకపోవడం గమనార్హం. దీంతో పార్టీ ఏవిధంగా దెబ్బతిందో అందరికీ అర్ధం అవుతూనే ఉంది. దాదాపు 15 ఏళ్ల కిందటి పరిస్థితికి టీడీపీ జారిపోయింది. దీనిపై ఇప్పటి వరకు అధ్యయనం చేయలేదు. తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నాన్ని కూడా టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టలేదు.
కానీ, ఇంతలోనే తిరుపతి పార్లమెంటు స్థానం ఎన్నికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మళ్లీ ఇక్కడ గెలుపు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. మళ్లీ హడావిడి ప్రారంభించేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలుపుపై ఏ పార్టీ నేతకు ఆశలు లేకపోయినా కనీసం స్థానికంలో జరిగిన తప్పులను సరిచేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా.. కానీ.. ఆదిశగా చంద్రబాబు దృష్టి పెట్టకపోవడం గమనార్హం. విఫలమైన నాయకులను తెచ్చి.. తమపై రుద్దుతున్నారని ఇప్పటికే తిరుపతి నేతల మధ్య చర్చగా సాగుతోంది.
అంతేకాకుండా… కొంత సేపు గెలిచి తీరాలని అంటున్నా.. మరికొంత సేపు.. గెలవకపోయినా.. వైసీపీ దూకుడును నిలువరిస్తే.. చాలనే వ్యాఖ్యలు చేయడం కూడా ఇక్కడ పార్టీ నేతలకు నిరాశగానే ఉండడం గమనార్హం. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఇక్కడ అభ్యర్థిగా ఉన్న పనబాకకు చంద్రబాబు ఆర్థికసాయం చేస్తామని.. ఆ విషయంలో ధైర్యంగా ఉండమని హామీ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం తూతూ మంత్రంగా చేతులు దులిపేసుకుని స్థానిక నేతలపై ఖర్చును నెట్టేయాలని చూస్తున్నారట.
ఇక తిరుపతి ఉప ఎన్నిక కోసం టీడీపీ నియమించుకున్న రాబిన్ శర్మ ఉన్నాడా ? లేడా ? అన్నది కూడా అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో తిరుపతిలో అసలు టీడీపీ స్ట్రాటజీ ఏంటనే విషయం ఆసక్తిగా మారింది. కాగా, నేటి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికల వేడి రాజుకున్నా టీడీపీలో ఆశలు సన్నగిల్లుతున్నాయి.