ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కిన సంగతి తెలిసిందే. అన్ని పార్టీలను సంప్రదించకుండానే ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్ని నోటిఫికేషన్ విడుదల చేయడం విమర్శలకు తావిచ్చింది. దీంతో, సాహ్ని నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్ ను టీడీపీ, జనసేన, బీజేపీలు బహిష్కరించాయి.
ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో పొలిట్ బ్యూరో సమావేశంలో ఎన్నికలను బహిష్కరించడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరిస్తోందని చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల్లో టీడీపీ పాల్గొనకపోవడం కఠిన నిర్ణయం అని, కానీ, తప్పడంలేదని చంద్రబాబు అన్నారు.
టీడీపీకి ఎన్నికలు కొత్త కాదని, ఎన్నికలకు భయపడే పార్టీ కాదని అన్నారు. కానీ, ఏపీలో ఎటువంటి పాలన, పరిస్థితులు ఉన్నాయో ప్రజలకు అర్థం కావాలనే ఉద్దేశ్యంతోనే తాము కఠిన నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు మీడియా సమావేశంలో వివరించారు. బలవంతపు ఏకగ్రీవాలు, బెదిరింపులతో నామినేషన్ల ఉపసంహరణలు…వంటి చర్యలతో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు.
ఏపీలో నిబంధనలను తుంగలో తొక్కారని, ప్రజాకోర్టులో జగన్ సర్కార్ ను దోషిగా నిలబెడతామని అన్నారు. దీనిపై జాతీయస్థాయిలోనూ పోరాడతామని, ఉత్తర కొరియా తరహాలో ఏపీలోనూ నియంతృత్వ పోకడలు వినాశనానికి దారి తీస్తాయని, ఇప్పుడు ఏపీలో జగన్ వంటి నియంత పాలిస్తున్నాడని విమర్శించారు.
ఏపీలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారని, పాత ఎస్ఈసీ పదవిలో ఉండగానే పరిషత్ ఎన్నికలపై మంత్రులు ప్రకటనలు చేశారని మండిపడ్డారు. పార్టీలను సంప్రదించకుండానే కొత్త ఎస్ఈసీ వచ్చీ రావడంతోనే నోటిఫికేషన్ జారీ చేయడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.
2014లో 2 శాతం ఏకగ్రీవాలు జరిగితే, 2021లో 24 శాతం ఏకగ్రీవాలు జరిగాయని, సీఎం ఏమైనా పెద్ద పోటుగాడా అని చంద్రబాబు ప్రశ్నించారు. పులివెందులలోనూ అత్యధికంగా ఏకగ్రీవాలు అయ్యాయని, దీనిపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బలవంతపు ఏకగ్రీవాలు, పథకాలు అందవని ప్రజలకు వలంటీర్ల బెదిరింపులు…నామినేషన్లకు సిద్ధపడిన అభ్యర్థులకు పోలీసుల బెదిరింపులు…ఇలా ఉంటే 24 శాతం ఏకగ్రీవాలు కావడంలో ఆశ్చర్యం ఏముందని అన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు ఎలా పారదర్శకంగా జరుగుతాయని ప్రశ్నించారు. లాలూచీ పడడం కాదు, గుడ్డిగా సంతకాలు పెట్టడం కాదని, నిష్పాక్షికంగా ఎన్నికలు జరపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని చంద్రబాబు మీడియాకు వెల్లడించారు.