ఏపీలో వైసీపీ అదినేత, సీఎం జగన్ పాలనపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తాజాగా ఓపుస్తకాన్ని రూపొందిం చింది. “నవరత్నాలు-నవమోసాలు“ పేరుతో రూపొందించిన ఈ పుస్తకాన్ని ఆ పార్టీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నవరత్నాలు, మేనిఫెస్టో, జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో 85 శాతం ఫెయిల్’ పుస్తకం రాష్ట్రంలో జగన్ పనితీరుకు అద్దం పడుతుందన్నారు. సీఎం జగన్ రెడ్డి ఎంత మోసగాడో, ఎంత పచ్చి అబద్ధాలకోరో ప్రజలకు తెలియచేయడానికే ఈ పుస్తకం రూపొందించామన్నారు.
పాదయాత్ర, ఎన్నికల సమయంలో, వివిధ సందర్భాల్లో జగన్ ఇచ్చిన మొత్తం హామీలు 730 అని, అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చింది కేవలం 109 మాత్రమేనని.. 85 శాతం హామీలు విస్మరించి ప్రజల్ని వంచించడమేనా జగన్ రెడ్డి నీతి.. నిజాయితీ? అని అచ్చెన్నాయుడు నిల ప్రశ్నించారు. తన మేనిఫెస్టోను ఖురాన్, భగవద్గీత, బైబిల్తో పోల్చుకునే సీఎం.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఎందుకు విస్మరించారని నిలదీశారు.
మేనిఫెస్టోలో చెప్పినవి ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. టీడీపీ మేనిఫెస్టోను చంద్రబాబు ప్రజల ముందు ఉంచలేదనే జగన్ రెడ్డి, వైసీపీ నేతలు ఎన్నిక ల కమిషన్ వెబ్ సైట్లో చూస్తే కళ్లు బైర్లుకమ్ముతాయన్నారు. టీడీపీ మేనిఫెస్టో తళతళలాడుతున్న అద్దం లా ఎన్నికల కమిషన్ వెబ్ సైట్లో కనిపిస్తోందన్నారు. టీడీపీ మేనిఫెస్టోలోని హామీల్లో చంద్రబాబు 99 శాతం 2014-19 మధ్య అమలు చేశారనే వాస్తవం కూడా జగన్ రెడ్డి అతని ప్రభుత్వానికి బోధపడుతుందన్నారు.
జగన్ రెడ్డి ఈ నాలుగున్నరేళ్లలో చేసిన అప్పులు, ప్రజల రక్తం పీల్చి వసూలుచేసింది కలిపి మొత్తం రూ.12 లక్షల కోట్లని, ఆ మొత్తంలో బటన్ నొక్కుడు ద్వారా ప్రజలకు అందించిన సాయం కేవలం రూ.2.40 లక్షల కోట్లు, మిగిలిన సొమ్ము ఎటుపోయిందో జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బటన్ నొక్కుడు ముసుగులో బొక్కింది ఎంతో.. ప్రజల నుంచి దోచింది ఎంతో సీఎం జగన్ చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
జాబ్ క్యాలెండర్, ఏటా డీఎస్సీ అని యువత, నిరుద్యోగుల్ని వంచించారని ఆరోపించారు. మద్యనిషేధం, సీపీఎస్ రద్దు హామీలతో మహిళలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులను రోడ్డున పడేశారన్నారు. 4 ఏళ్ల 8 నెలల పాలనలో ప్రజలకు, రాష్ట్రానికి ఇదిగో ఇది చేశానని చెప్పగల ధైర్యం జగన్ రెడ్డికి ఉందా? అని అచ్చెన్నాయుడు సవాల్ చేశారు.
ఇచ్చిన హామీలేమో 730, కానీ ఈ మోసపు నవరత్నాల బిళ్ళను ఇచ్చి మడిచి పెట్టుకోమన్నాడు జగన్.. #JaganLosingIn2024 #ByeByeJaganIn2024 #AndhraPradesh #WhyAPHatesJagan #JaganFailedPromises pic.twitter.com/X6w8grXbP7
— Telugu Desam Party (@JaiTDP) December 28, 2023