ఏపీలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జనసేన-బిజెపిలతో టీడీపీ పొత్తు వ్యవహారం చాలా కాలంగా నలుగుతూ వస్తుంది. ఆల్రెడీ బిజెపి, జనసేన మిత్రపక్షంగా ఉన్న నేపథ్యంలో వాటికి టిడిపి కూడా తోడవుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. టీడీపీ, బిజెపిల మధ్య కొంత గ్యాప్ ఉందని, దానిని తాను సెట్ చేసే ప్రయత్నం చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొంతకాలం క్రితం వ్యాఖ్యానించారు. అయితే. ఆ దిశగా అడుగులు ప్రస్తుతానికి పడలేదు. ఎవరికి వారే అన్న రీతిలో పవన్ వారాహి యాత్ర చేస్తుంటే, మరోవైపు లోకేష్ యువగళం చేస్తున్నారు. ఇక, చంద్రబాబు జిల్లాల వారీగా రోడ్ షోలు, సభలు నిర్వహించుకుంటూ తనదైన రీతిలో ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలో పొత్తుల వ్యవహారంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో కలిసి వెళ్లే పార్టీలకు ఓటమి తప్పదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. టిడిపి, జనసేన, వామపక్ష పార్టీలు మిత్రపక్షంగా ఏర్పడి పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తారని, ఈ కూటమి తప్పక అధికారం చేపడుతుందని రామకృష్ణ జోస్యం చెప్పారు. ఈ దిశగా చంద్రబాబు కూడా ఆలోచన చేస్తారని తాను భావిస్తున్నానని అన్నారు. అలా కాదని బిజెపి, జనసేన లతో టిడిపి కలిస్తే జగన్ నెత్తి మీద పాలు పోసినట్లేనని సంచలన కామెంట్లు చేశారు.
టిడిపి, జనసేన, బిజెపి కలవడం వల్ల జగన్ కు లాభం చేకూరుతుందని, అటువంటి తప్పుడు నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకోరని అనుకుంటున్నామని అన్నారు. ఇక, ఏపీలో అరాచక పాలన సాగుతోందని, అభివృద్ధి లేదని రామకృష్ణ మండిపడ్డారు. ప్రాజెక్టులు పూర్తి చేయడం లేదని, ఇండస్ట్రీలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని మండిపడ్డారు. జగన్ ఇంకోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం గుండుసున్నానే అని జోస్యం చెప్పారు. మరి, రామకృష్ణ వ్యాఖ్యలపై టిడిపి, జనసేన, బిజెపి నేతల స్పందన ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.