తాజా సర్వేలను అనుసరించి చూస్తే వైసీపీకి పాస్ మార్కులు కూడా రావని తేలిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో రెండోసారి రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చినన్ని సీట్లు కూడా ఆంధ్రాలో వైసీపికి రావని తేలిపోయింది.ఆ రోజు వైఎస్సార్ చెప్పిన మాట ఇప్పటి వేళ గుర్తు చేసుకుంటే విజయం వచ్చిందని విర్రవీగకండి అని ఆరోజు చెప్పారు. మనం జస్ట్ పాస్ అయ్యాం అంతే అని కూడా చెప్పారు.
ఆ రోజు మధ్యేమార్గంగా చిరు సపోర్ట్ ను తీసుకున్నారు వైఎస్సార్. కానీ ఇప్పుడు సీన్ అలా లేదు. ఉండదు కూడా.. ఎందుకంటే వైసీపీ నుంచే చాలా మంది టీడీపీకి వెళ్లి బీ ఫాం అందుకుని పోటీచేయాలన్న తలంపులో ఉన్నారు. ముఖ్యంగా అధినేత పోకడలు నచ్చక, అధినేత ఎదుట మాట్లాడేందుకు తగిన స్వేచ్ఛ లేకపోవడం వీటికి కారణాలు అని కూడా తెలుస్తోంది. దీంతో రానున్న యుద్ధంలో జగన్ కొత్త ముఖాలు వెతుక్కుంటే వారంతా ఏ మేరకు ప్రభావితం చేస్తారో కూడా చెప్పలేం.
అదేవిధంగా ఆ రెండు పార్టీలు కూడా ఇదే సమయంలో బలపడ్డాయని తేలిపోయింది. తెలుగుదేశం పార్టీ , జనసేన పార్టీ ఆశించిన స్థాయి కన్నా ఎక్కువే ప్రజామోదం పొందుతున్నాయని తేలిపోయింది. ఈ విషయం సొంత సర్వే సంస్థలు, సొంత పార్టీ మనుషులే జగన్ కు విన్నవిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నాయకులు అంతా పథకాల గోలలో పడి తమకు అస్సలు ప్రాధాన్యం ఇవ్వకుండా ఉంచారని సీఎంపై ఆరోపణలు చేస్తున్నారు.
ఆయన పాస్ అయితే చాలా మరి ! మేం ఏం కావాలి ? ఒక్కటంటే ఒక్క పని కూడా మేం చేయించుకోలేకపోతున్నాం.. ఆఖరికి పంచాయతీలకు వచ్చిన నిధులు కూడా తమకు ఉన్న విస్తృతాధికారాలు అడ్డం పెట్టుకుని వాడుకున్నారు. ఓ విధంగా అడ్డదారిలో లాక్కున్నారు అని సొంత పార్టీ నేతలే వాపోతున్నారు. గ్రామాల్లో ఈ రోజు తలెత్తుకోలేకపోతున్నామని , వీధి దీపాల నిర్వహణ, రోడ్ల మరమ్మతులు, పారిశుద్ధ పనుల నిర్వహణ వంటివి చేపట్టాలన్నా కనీస స్థాయిలో నిధులు లేక అవస్థలు పడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే స్థానిక సమస్యలనే ప్రధాన అజెండాగా తీసుకుని ఆ రెండు పార్టీలూ సోషల్ మీడియాలోనూ, అదేవిధంగా క్షేత్ర స్థాయిలోనూ యుద్ధం చేస్తున్నాయి. పోలీసులతో బండ బూతులు తిట్టించుకున్నా సరే, దెబ్బలు తిన్నా సరే, సీఆర్పీసీ నోటీసులు అందు కున్నా సరే, గృహ నిర్బంధ కాండను యథేచ్ఛగా నిర్వహించినా సరే అవేవీ పట్టించుకోకుండా పనిచేస్తున్నారు. ఇవే ఇప్పుడు ఆ రెండు పార్టీల బలోపేతానికి ప్రధాన కారణం అయ్యాయి.