జనసేన అధినేత, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర రాష్ట్రంలోని అధికార పార్టీ గుండెల్లో గుబులు పుట్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్ మూడు విడతలుగా చేపట్టిన వారాహి యాత్రకు అనూహ్య స్పందన వచ్చింది. వారాహి విజయ యాత్రం ఘన విజయం సాధించి అధికార పార్టీని ఇరకాటంలో పడేసింది. ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థపై పవన్ చేసిన విమర్శలు దేశవ్యాప్తంగా చర్చకు తెరతీశాయి. మూడు విడత యాత్రలలో వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పాలనపై పవన్ కళ్యాణ్ పదునైన విమర్శలు గుప్పిస్తూ వారాహి యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు.
టిడిపి, జనసేనల మధ్య అధికారికంగా పొత్తు ఖరారైన తర్వాత పవన్ చేపడుతున్న నాలుగో విడత వారాహి యాత్రపై భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలోనే అక్టోబర్ 1 నుంచి జరగబోతున్న వారాహి నాలుగో విడత యాత్ర గత యాత్రల కన్నా అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నుంచి నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభం కానుంది. మచిలీపట్నం, పెడన, కైకలూరు మీదుగా వారాహి యాత్ర కొనసాగనుంది. నాలుగో విడత యాత్ర సందర్భంగా చంద్రబాబు అరెస్టు, అక్రమ కేసులు వంటి వ్యవహారాలపై పవన్ ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉందని టాక్ వస్తుంది.
దాంతోపాటు, ప్రజా సమస్యలు, రాబోయే ఎన్నికలలో జనసేన-టిడిపి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించడం వంటి విషయాలపై పవన్ ప్రసంగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా మూడు విడతలతో పోలిస్తే పవన్ నాలుగో విడత వారాహి యాత్రకు భారీగా జనసేన కార్యకర్తలు హాజరయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. జనసైనికులతో పాటు తెలుగు తమ్ముళ్లు కూడా పవన్ యాత్రలకు భారీగా తరలివచ్చే అవకాశముంది.