వ్యూహాల్ని అమలు చేసే విషయంలో తోపు.. తురుంఖాన్ అంటూ పొగడ్తల మత్తులోకి దించేసి.. మేరునగ పర్వతంగా ఉన్నోడ్ని.. అసలేమీ లేని ఉత్తగా మార్చేసే మాయాజాలం కొన్నేళ్లుగా చాపకింద నీరులా సాగిందా? ప్రత్యర్థుల వ్యూహాల్ని అర్థం చేసుకోలేని పార్టీ నేతలు.. క్యాడర్ వైఫల్యం చివరకు ఒక మహా నేత ప్రాణాలకు సంకటంగా మారిందా? అన్నదిప్పుడు చర్చ. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత దుర్మార్గుడిగా.. అత్యంత ద్రోహిగా.. అత్యంత కుటిలత్వంతో ఉండే నేతల జాబితాలో చంద్ర బాబు పేరు ముందు ఉంటుంది.
నిజంగానే ఆయన అంత దుర్మార్గుడా? ద్రోహినా? కుటిలత్వానికి కేరాఫ్ అడ్రస్సా? అంటే.. కాదని ఎవరు చెబుతారని ప్రశ్నిస్తారు. నిజంగానే అవన్నీ నిజాలే అనుకుందాం? దుర్మార్గుడనే ముద్ర గురించే మాట్లాడుకుందాం. దుర్మార్గుడే అయితే.. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో అల్లర్లు ఎందుకు జరగలేదు? దుర్మార్గుడే అయితే.. ఏపీ పేరు జాతీయస్థాయిలో.. అంతర్జాతీయ స్థాయిలో ఎందుకు మారుమోగింది? దుర్మార్గుడే అయితే… ఏపీ అన్నంతనే మరో బిహార్.. మరో యూపీలాంటి ఇమేజ్ ఎందుకు రాలేదు? ఇప్పుడు చెప్పండి చంద్రబాబు.. దుర్మార్గుడా? కాదా? అన్నది.
ద్రోహి అన్న బిరుదుకే వద్దాం. నిజంగానే చంద్రబాబు ద్రోహినే. ఎక్కడైనా ఏ తెలుగు అధినేత అయినా.. ఏదో ఒక ప్రాంతంలోనే ద్రోహిగా ముద్ర పడి.. మిగిలిన ప్రాంతాల్లో కారణజన్ముడిగా మారతారు. మరి.. చంద్రబాబు ఏపీకి ద్రోహినే. తెలంగాణకు ద్రోహినే. తెలంగాణ ఈ రోజు వచ్చిందంటే దానికి కారణం.. ఎవరు అవునన్నా కాదన్నా చంద్రబాబే. అలాంటప్పుడు తెలంగాణకు ద్రోహిగా ఎందుకు మారాడు?
రాష్ట్ర విభజనకు ఓకే చెబితే చాలు.. తెలుగుదేశం పార్టీ హెడ్డాఫీసులో అటెండరుగా నౌకరి చేస్తానని చెప్పిన హరీశ్ రావు.. చివరకు చంద్రబాబు సంతకం పెట్టిన తర్వాత తెలంగాణ ద్రోహిగా ముద్ర వేశారు. తెలంగాణకు ద్రోహం చేయలేక.. తాను పుట్టి పెరిగిన ఏపీకి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు రెండు కళ్ల మాట చెబితే.. ప్రపంచంలో అంతకు మించిన బూతు మరొకటి లేదన్నప్పుడు మౌనంగానే భరించాడే తప్పించి.. మిగిలిన వారిలా విద్వేషాన్ని చిందించలేదు. ఒకవైపు నిలిచి.. విద్వేషాన్నిచిందించి ఉంటే.. రెండు ప్రాంతాల తెలుగు వారి మధ్యఇప్పుడున్న సోదర భావం ఉండేదా? రాజకీయం కోసం ఆ పని చేయని చంద్రబాబు తెలంగాణ ద్రోహి. ఏపీ ద్రోహి కాకుండా ఉంటారా ఏంటి?
కుటిలత్వం అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఎవరైనా ఉంటారంటే.. అది చంద్రబాబే. తెలుగు రాజకీయాల్ని భ్రష్టు పట్టించిందే ఆయన అంటూ విరుచుకుపడటం కనిపిస్తుంది. కుటిలత్వాన్ని నింపుకున్న చంద్రబాబు మావోలను సమూలంగా తుదముట్టించేశాడుగా? కుటిలత్వం ఉన్న కారణంగానే 2004 ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో తెలంగాణ ప్రస్తావన తీసుకొచ్చి.. వెయ్యికి పైగా అమాయకుల ప్రాణాలు తీశాడుగా? కుటిలత్వంతోనే.. వ్యవస్థలు మొత్తం నిర్వీర్యం అయ్యేలా చేశాడుగా? కుటిలత్వంతోనే..అధికారుల్ని ఎస్ బాస్ అన్నట్లుగా మార్చేశాడుగా? కుటిలత్వం నిండుగా నింపుకోవటం వల్లే.. తన ప్రభుత్వంలో జరగని పోస్టింగులకు సంబంధించి అన్నీ పోలీసు పోస్టులు కమ్మోళ్లకే కట్టబెట్టినట్లుగా జరిగిన ఫేక్ ప్రచారంపై పల్లెత్తు మాట అనటం తర్వాత.. దాన్ని సరైన రీతిలో కౌంటర్ ఇచ్చింది లేదు.
ఇన్ని దుర్గుణాలు ఉన్న చంద్రబాబుకు మరో కీర్తికిరీటం కూడా పెట్టేశారు. అదే.. వ్యవస్థల్ని మేనేజ్ చేయటం. ఆ విషయంలో ఆయన పీహెచ్ డీ చేసేశాడని.. ఎవరైనా ఆయన వద్దే పాఠాలు నేర్చుకోవాలని గొప్పగా చెప్పేవారు. ఇది విన్న తెలుగు తమ్ముళ్లు.. తమ బిగ్ బాస్ ఇమేజ్ ను హీరోయిజంగా ఫీలయ్యారే కానీ.. ఇదంతా వ్యూహాత్మకంగా మొదలైన కుట్ర అన్న విషయాన్ని గుర్తించలేదు. తెలుగు తమ్ముళ్ల దద్దమ్మతనంతో చివరకు చంద్రబాబు ప్రాణాల మీదకే వచ్చింది. ఎన్నికల వేళలో పోల్ మేనేజ్ మెంట్ చంద్రబాబు తర్వాతే ఎవరైనా అంటూ ప్రచారం జరిగితే.. జబ్బలు చరుచుకున్న తెలుగు తమ్ముళ్లు.. తమను ట్రాప్ లో పడేసే వ్యూహంలో భాగమన్న విషయాన్ని గుర్తించలేకపోయారు.
నిజంగానే చంద్రబాబు పోల్ మేనేజ్ మెంట్ లో తోపు అయితే..2004, 2009, 2019లో ఎందుకు ఓడిపోతాడు. 2014లో గెలుపు కూడా ఒక గెలుపు కాదంటూ రాజకీయ ప్రత్యర్థులు ఉతికిఆరేస్తే.. సమాధానం ఎందుకు చెప్పలేకపోయే పరిస్థితి. ఉన్నదానికి మించి గొప్పగా చెప్పేస్తూ.. నెగిటివిటినీ వ్యాపించేస్తూ.. అసలుకే ఎసరు తెస్తూ.. పేరు పలికినంతనే వామ్మో.. ఎంత దారుణమైనోడన్న భావన కలిగించే ఎత్తుగడకు చిక్కుకుపోయినోడు చంద్రబాబు.
న్యాయవ్యవస్థను జయప్రదంగా మేనేజ్ చేస్తారంటూ అదే పనిగా నోటికి వచ్చినట్లు తిట్టినోళ్లంతా.. ఒకప్పుడు చంద్రబాబు నీడన బతికినోళ్లే. నిజంగానే న్యాయవ్యవస్థను మేనేజ్ చేసే సత్తా ఉంటే..అసలు అరెస్టు కాకుండానే ఉండే వారు కదా? ఆ మాత్రం అతితెలివి చంద్రబాబుకు ఎందుకు లేనట్లు? జైల్లో ఉండి.. బెయిల్ తెచ్చుకోవటం తర్వాత.. బెయిల్ వచ్చే అవకాశాల్ని లేకుండా చేయటం కోసమే.. మాటకు ముందు, మాటకు తర్వాత ‘వ్యవస్థల్ని మేనేజ్ చేసే సత్తా ఉన్న చంద్రబాబు’ ట్యాగ్ లైన్ వేయటం వెనుక అసలు లెక్క.. బెయిల్ రాకుండా చేయటమన్న ఎత్తుగడ.
వయసులో పెద్దోడైనప్పటికీ.. ముసలోడా అని ఛీదరింపులకు సైతం తెలుగు ప్రజలు స్పందించనంతగా చంద్రబాబు మీద ఆగ్రహాన్ని పెంచేయటం చూసినప్పుడు.. ఎవరు అసలు ముదురుకేసు అన్నది అర్థమవుతుంది. నిజంగానే నీచ నిక్రష్ట.. దుష్ట.. దుర్మార్గ.. కుటిలత్వం నరనరాన చంద్రబాబు నింపుకొని ఉంటే.. జైల్లో చర్మ సంబంధిత వ్యాధితో తీవ్ర అవస్థలకు గురి అవుతూ.. కంటి సర్జరీ అవసరమని చెబుతున్నా.. ఇప్పటికిప్పుడు అవసరం లేదన్న సన్నాయి నొక్కులు తీరు చూస్తే.. చంద్రబాబు అమాయకుడా? మాయకుడా? అన్నది అర్థమవుతుంది. అయినా.. చంద్రబాబు దుర్మార్గుడే అంటే.. నిజమే దుర్మార్గుడు. ఎందుకంటే.. అంత బలంగా ముద్ర పడేలా ప్రచారాన్ని అడ్డుకోలేని మంచితనం కూడా దుర్మార్గమే అవుతుంది. ప్రత్యర్థులు ఇష్టారాజ్యంగా తూలనాడుతున్నా.. మా బాబు మొనగాడంటూ గొప్పలకు పోయే తెలుగు తమ్ముళ్లే అసలుసిసలు ద్రోహులు. వారు చేసినంతగా చంద్రబాబు ప్రత్యర్థులు సైతం ద్రోహం చేయలేదేమో?