ఏపీ సీఎం చంద్రబాబు గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ పరిచయం అక్కర్లేదు. విజనరీ లీడర్ గా ఖ్యాతి గడించిన చంద్రబాబును పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. విజన్ 2020 అంటూ 20 ఏళ్లకు ముందే ఐటీ రంగంలోని పురోగతిని అంచనా వేయగలిగిన దార్శనికుడు చంద్రబాబు. ఇప్పుడు అదే విధంగా విజన్ 2047 అంటూ తన అనుభవంతో చంద్రబాబు అందుకున్న నినాదం దేశవ్యాప్తంగా పాపులర్ అయింది.
ఈ నేపథ్యంలోనే గత ఐదేళ్లుగా ఏపీలో పడకేసిన పారిశ్రామిక రంగాన్ని చంద్రబాబు గాడిలో పెడుతున్నారు. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ఉంటే చాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని ఎందరో పారిశ్రామికవేత్తలు గత ఎన్నికలకు ముందు అనుకున్నారు. వారు అనుకున్న విధంగానే ఏపీ పగ్గాలు చేపట్టిన తర్వాత చంద్రబాబు బ్రాండ్ నేమ్ చూసి భారీ పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి వస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అందులో భాగంగానే తాజాగా టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తో చంద్రబాబు భేటీ అయ్యారు.
ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటులో భాగంగా ఆరేడు శాఖల్లో కొత్త పాలసీల రూపకల్పనకు రంగం సిద్ధమైంది. ఆ క్రమంలోనే సీఐఐ ప్రతినిధుల బృందం..చంద్రబాబుతో భేటీ అయింది. సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ నేతృత్వంలోని బృందం చంద్రబాబును కలిసింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన పారిశ్రామిక విధానంపై సీఐఐ ప్రతినిధులతో చంద్రబాబు చర్చించారు.
నటరాజన్ తో భేటీ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై ఇరువురు చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ది, స్వర్ణాంధ్రప్రదేశ్- విజన్ 2047 రూపకల్పన అంశాలపై ఇద్దరూ చర్చించుకున్నారు. ప్రఖ్యాత పారిశ్రామిక వేత్తలు, ఆయా రంగాల నిపుణులతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కానుంది. ఈ టాస్క్ ఫోర్స్ చైర్మన్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు,కో చైర్మన్‌గా నటరాజన్ వ్యవహరించనున్నారు. 2047 నాటికి ఏపీని నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపే లక్ష్యంతో విజన్ 2047ను చంద్రబాబు ప్రభుత్వం రూపొందిస్తోంది.
ఏపీలో పారిశ్రామికాభివృద్దికి చేపట్టాల్సిన చర్యలపై టాస్క్ ఫోర్స్ ప్రణాళికలు రూపొందించనుంది. అమరావతిలో సీఐఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్ సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంస్థ ఏర్పాటులో టాటా గ్రూప్ భాగస్వామి కానుంది. విశాఖలో టీసీఎస్ డెవల్మెంట్ సెంటర్ ఏర్పాటు, ఏపీలో ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్ లైన్స్ విస్తరణ అంశాలపై నటరాజన్, చంద్రబాబు చర్చించారు. రాష్ట్రంలో సోలార్, టెలికమ్యునికేషన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై కూడా వారు చర్చలు జరిపారు.