తెలంగాణ కాంగ్రెస్(టీ-కాంగ్రెస్) పార్టీలో మళ్లీ కల్లోలం బయల్దేరింది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కేంద్రంగా తీవ్ర దుమారమే తెరమీదికి వచ్చింది. ఫలితంగా.. ఇది అధికార పార్టీ అధినేత కేసీఆర్ మేలు చేస్తుందే తప్ప.. కాంగ్రెస్‌కు పావలా కాసంత ప్రయోజనం చేకూర్చి పెట్టదని అంటున్నారు పరిశీలకులు.
వాస్తవానికి ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్ ను పరిశీలిస్తే.. `కలహాల పార్టీ` అనే ముద్రపడిపోయింది. ఆ పార్టీలో సాధారణ కార్యకర్త కూడా పీసీసీ చీఫ్‌ను విమర్శించే పరిస్థితి వచ్చిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్గత ప్రజాస్వామం ముసుగులో నాయకులు చేసుకుంటున్న పోరాటం.. పొరుగు పార్టీలకు మేలు చేస్తోందనే వాదన బాహాటంగానే వినిపిస్తోంది.
టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి రేవంత్‌రెడ్డిని దింపాలని ఆ పార్టీలో కొందరు సీనియర్ నేతలు పట్టుబడుతున్నారు. మరికొందరు ఆయనకు మద్దతుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ముదురుతున్న వివాదం.. రోడ్డున పడింది. రాజీనామాలు.. పంతాలు.. పట్టింపులు అంటూ.. సవాళ్ల రాజకీయం తెరమీదికి వస్తోంది.
ఇప్పుడిప్పుడే.. కాంగ్రెస్ పుంజుకుంటున్న పరిస్థితి నుంచి అధికారం దక్కించుకునే అడుగులు వేస్తోందని కాంగ్రెస్ వాదులు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఇలాంటి కుళాయి గొడవలు.. పార్టీ పరువును హుస్సేన్ సాగర్‌లో ముంచేస్తున్నాయనే వాదన వినిపిస్తోంది.
తాజాగా టీ కాంగ్రెస్ సీనియర్లు సమావేశమయ్యారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న నేతలందరూ భేటీ అయ్యారు. అయితే.. ఈ సీనియర్ల భేటీపై పలువురు కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి హరీష్‌రావుతో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ రహస్య సమావేశం తర్వాతే.. సీనియర్ల భేటీలు మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు పార్టీలో చిచ్చు పెడుతున్నారని మండిపడుతున్నారు. పార్టీకి నష్టం చేసేవారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ పార్టీ నాయకులతో టీఆర్ఎస్ నాయకులకు ఏం పని? అని ప్రశ్నిస్తున్నారు.
వీహెచ్‌ను హరీష్‌రావు ఏందుకు కలిశారని నిలదీస్తున్నారు. కోకాపేటలో ఏం జరిగిందో తాము బయటపెట్టాలా అని ప్రశ్నిస్తున్నారు. పార్టీలో సమస్యలుంటే కొట్లాడాలి కానీ.. శత్రువు దగ్గర మొకరిల్లితే ఎలా అని నిలదీస్తున్నారు. హరీష్‌రావును కలిసిన తర్వాతే వీహెచ్ సమావేశం పెట్టారని మండిపడుతున్నారు.
కొత్త పీసీసీ వచ్చాక ప్రజల్లో కాంగ్రెస్ పట్ల విశ్వాసం పెరిగిందని కొందరు నేతలు రేవంత్‌రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్‌కు ప్రజాదరణ చూసి టీఆర్ఎస్కు భయం పట్టుకుందని, సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండడంతో టీఆర్ఎస్ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. సీనియర్లు మాత్రం తమ ధోరణిలోనే ముందుకు సాగుతున్నారు. తాము ఏం చేస్తే.. పీసీపీ అధ్యక్షుడికి ఎందుకని.. తాము ఎవరినైనా కలిసే హక్కు ఉందని.. ఒక ఎమ్మెల్యేగా.. ప్రజాప్రతినిధిగా మంత్రిని కలిస్తే.. తప్పేంటని.. జగ్గారెడ్డి వంటివారు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. కానీ, ఇప్పుడు కీలక దశలో కాంగ్రెస్ పుంజుకుంటున్న సమయంలో ఇలా వ్యవహరించడం వల్ల.. పార్టీకి మేలు కన్నా కీడే ఎక్కువగా జరుగుతుందన్నది కాంగ్రెస్ వాదుల భావన. ఏదేమైనా.. టీ-కాంగ్రెస్‌లో చెలరేగిన కల్లోలం ఎటు దారితీస్తుందోనని .. అందరూ చర్చించుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.