ఫ్యాన్సీ నెంబర్లకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఖరీదైన కారును కొనగానే సరికాదు.. దానికి తగ్గట్లుగా.. తమకున్న నమ్మకాల ఆధారంగా నెంబర్లను బుక్ చేసుకోవటం.. అందుకోసం ఎంత ఖర్చు కైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తుంటారు కొందరు. ఆ కోవలోకే వస్తారు ప్రముఖ సినీ నటులు తారక్. ఆయనకు ‘9999’ నెంబర్ అంటే విపరీతమైన అభిమానం. గతంలో ఆయన కార్ల నెంబర్లు మొత్తం ఆ నెంబర్ లోనే ఉంటాయి. దాని కోసం ఆయన ఎంతకైనా సిద్ధమవుతారు. తాజాగా ఆయన ఈ నెంబర్ కోసం భారీగా ఖర్చు పెట్టారు.
ఆయన పెట్టిన ఖర్చు లెక్క తెలిసిన వారంతా ఆశ్చర్యంతో నోరెళ్ల బెడుతున్నారు. తాను కోరుకున్న ఫ్యాన్సీ నెంబర్ ను సొంతం చేసుకోవటం కోసం.. ఎగువ మధ్యతరగతి వారు కొనే హైఎండ్ కారు ఖరీదుకు దగ్గర దగ్గరగా ఖర్చు చేసేయటం ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఆయన కొన్న కొత్త కారు కోసం తనకెంతో ఇష్టమైన TS09 FS 9999 నెంబర్ ను ఆర్టీవో అధికారులు నిర్వహించిన వేలంలో పాల్గొన్నారు.
ఈ నెంబర్ కోసం ఆయన ఏకంగా రూ.17 లక్షలు ఖర్చు చేయటం విశేషం. అంతేకాదు.. టీఎస్ 09 ఎఫ్ టీ 0001 నంబర్ ను సొంతం చేసుకోవటానికి లహరి ఇన్ ఫ్ట్రాస్ట్రక్చర్ ప్రైవేటు లిమిటెడ్ వారు దీన్ని రూ.7.01లక్షలు ఖర్చు చేశారు. ఇక.. టీఎస్ 09 ఎఫ్ టీ 0009 నంబర్ కోసం రతన్ నల్లా అనే వ్యక్తి రూ.3,75,999 ఖర్చు చేశారు. ఇలా ఫ్యాన్సీ నెంబర్ల ఆక్షన్ లో ఆర్టీఐ శాఖకు ఏకంగా రూ.45.52 లక్షల ఆదాయం లభించటం గమనార్హం. ఏమైనా.. ఫ్యాన్సీ నెంబర్ల మీద ఉన్న మోజు.. ఎంత ఖర్చు చేయటానికైనా సిద్ధమవుతారన్న విషయం తాజా ఉదంతంతో మరోసారి స్పష్టం చేసిందని చెప్పాలి.