టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న హఠాత్తుగా గుండెపోటుకు గురై సొమ్మసిల్లి పడిపోయిన సంగతి తెలిసిందే. కుప్పంలో యాంజియోగ్రామ్ నిర్వహించి ప్రాథమిక చికిత్స అందించిన తరువాత మెరుగైన వైద్యం కోసం తారకరత్నను బెంగుళూరులోని నారాయణ హృదయాల ఆసుపత్రికి తరలించరాు. ఈ సందర్భంగా తాజాగా అక్కడి వైద్యులు తారకరత్న ఆరోగ్య స్థితిపై హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు.
తారక రత్న జనవరి 27న కుప్పంలో గుండెపోటుకు గురయ్యారని, తారకరత్నను రాత్రి 1 గంటకు కుప్పం నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తీసుకువచ్చారని వైద్యులు వెల్లడించారు. అప్పటికి ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని తెలిపారు. నిపుణులతో కూడిన తమ వైద్యబృందం ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని చెప్పారు. కానీ, తారకరన్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్ లో స్పష్టం చేశారు.
పూర్తిగా వైద్యసాయంపైనే తారకరత్న ఆధారపడి ఉన్నారని, ఎక్మోపై ఉన్నారని తెలిపారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నిశిత పరిశీలన, చికిత్స కొనసాగుతాయని వివరించారు. అయితే, ఈ సమయంలో తారకరత్నను చూసేందుకు ఎవరూ రావొద్దని, చికిత్సకు ఆటంకం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు. మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ తర్వాత కార్డియోజెనిక్ షాక్ కారణంగా అతడి పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని వెల్లడించారు.
కాగా, తారకరత్న వెంట ఆసుపత్రి దగ్గర బాలకృష్ణ, తారక రత్న భార్య, కుమార్తెలు ఉన్నారు. మరోవైపు, తారకరత్నను పరామర్శించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు, హీరో జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరుకు వెళ్లబోతున్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని హీరో కల్యాణ్ రామ్ ప్రార్థించారు.