కేంద్రంపై విమర్శలు చేసినా.. ప్రభుత్వాన్ని ఇరుకున పడేసే ప్రయత్నం చేసినా.. కేంద్ర రంగ సంస్థలు.. అధికారులు రంగంలోకి దిగుతారన్న విమర్శలు.. ఆరోపణలు తరచూ మోడీ సర్కారు మీద వినిపిస్తూ ఉంటాయి. గతాన్ని వదిలేస్తే.. బాలీవుడ్ ప్రముఖులపై మూడురోజుల పాటు ఐటీ దాడులు జరిగిన తీరు చర్చనీయాంశంగా మారింది.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరుకు నైతిక మద్దతు ఇస్తున్న వారిని గురి పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఐటీ సోదాలు జరిగిన వారిలో ఒకరైన నటి తాప్సీ తాజాగా ట్విటర్ వేదికగా స్పందించారు.
మూడు రోజుల పాటుసాగిన సోదాల గురించి.. మూడు పాయింట్లలో ఆమె చెప్పిన విషయాలు ఆసక్తికరంగా మారాయి. గడిచిన మూడు రోజుల నుంచి తన నివాసంలో ఒక బంగ్లాకు సంబంధించిన తాళం గురించి వెతికారన్నారు. పారిస్ లో తనకు ఒక బంగ్లా ఉందని.. దాని తాళాల కోసం వెతికినట్లు చెప్పారు. అయితే.. తనకు అక్కడ బంగ్లా లేదన్నారు.
తాను రూ.5 కోట్లు తీసుకున్నట్లు ఆరోపిస్తూ.. అందుకు సంబంధించిన రశీదుల కోసం వెతికారని.. కానీ తానెప్పుడూ అంత మొత్తాన్ని తీసుకోలేదన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. తాప్సీ తదితరులపై 2013లో కూడా ఐటీ సోదాలు జరిగినట్లు చెప్పారు. అయితే.. అప్పట్లో ఎప్పుడూ తన ఇంటిపై ఐటీ సోదాలు జరగలేదని స్పష్టం చేసింది.
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్.. సినీ నటి తాప్సీలతో పాటు.. పలువురు సినిమా రంగానికి చెందిన ప్రముఖుల ఇళల్ల్లో ఐటీ రంగానికి చెందిన అధికారులు సోదాలు నిర్వహించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో.. ఈ విమర్శలకు సమాధానాలు ఇచ్చేందుకు కేంద్రమంత్రి నిర్మల సీతారమన్ ఇష్టపడలేదు.
2013లో కూడా వారిపై ఐటీ సోదాలు జరిగాయని.. అప్పట్లో పట్టించుకోని మీడియా ఇప్పుడు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ మీడియా అధిక ప్రాధాన్యత ఇస్తే మాత్రం.. స్పష్టం చేయటానికి సమావేశాన్ని నిర్వహిస్తే తప్పేం కాదు కదా? అయినా.. బాలీవుడ్ లో అంతమంది ప్రముఖులు ఉండగా.. మోడీ సర్కారు చేసే తప్పుల్ని తరచూ ఎత్తి చేపే వారి మీదనే అధికారుల సోదాలు ఉంటున్నాయన్న సూటి ప్రశ్నకు నిర్మలమ్మసమాధానం చెప్పేస్తే బాగుంటుందన్నమాట వినిపిస్తోంది.