ఏపీలో వరుసగా మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో గ్యాంగ్ రేప్ ఘటన మరువక ముందే తాజాగా రేపల్లె రైల్వే స్టేషన్ లో భర్త ముందే భార్య గ్యాంగ్ రేప్ ఘటన సంచలనం రేపింది. ఈ క్రమంలో ఏపీలో మహిళలకు రక్షణ ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన ఏపీ హోం మంత్రి తానేటి వనిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
సాటి మహిళ అయి ఉండి కూడా అమ్మాయిలపై అత్యాచారాల గురించి తానేటి వనిత చేసిన కామెంట్లు రాజకీయ దుమారం రేపుతున్నాయి. బిడ్డల సంరక్షణ బాధ్యత తల్లిదేనని, ఆ పాత్ర సరిగా లేనప్పుడే అత్యాచారాల వంటివి జరుగుతుంటాయని వనిత చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్ర బిందువయ్యాయి. తండ్రి పనిమీద బయటకు వెళ్లినప్పుడు బిడ్డల సంరక్షణ బాధ్యతను తల్లి చూసుకుంటుందని, ఆమె కూడా ఉద్యోగం కోసమో, కూలి పనుల కోసమో బయటకు వెళ్తుండడంతో పిల్లలు ఇంట్లోనే ఒంటరిగా ఉండిపోతున్నారని అన్నారు.
అదే అలుసుగా తీసుకుని ఇరుగుపొరుగువారు, బంధువులు, కొన్ని చోట్ల తండ్రులే పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని వనిత అన్నారు. తాళ్లపూడిలో ఓ మహిళ పోలీస్ స్టేషన్కు వెళ్తే 3 రోజుల వరకు కేసు నమోదు చేయలేదన్న విలేకరి ప్రశ్నకు వనిత స్పందించారు. ఈ విషయంలో విచారణకు ఆదేశించామని, పోలీసుల నిర్లక్ష్యం ఉన్నట్టు తేలితే చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు.
ఈ నేపథ్యంలో ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ”ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మర్డర్… పూటకో రేప్. బీహార్ ను మించిపోయింది ఆంధ్రప్రదేశ్. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని వెంకటాద్రిపురం నుంచి బతుకుదెరువు కోసం భర్త, పిల్లలతో వలసవెళ్లిన మహిళపై రేపల్లె రైల్వే స్టేషన్ లో కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు.
రాష్ట్రంలో ఏం చేసినా పోలీసులు ఏమీ చేయలేరనే ధైర్యంతోనే ఉన్మాదులు ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారు. హోం మంత్రి తానేటి వనిత ఒక మహిళ అయి ఉండి మహిళల తప్పిదాలవల్లే రేప్ లు జరుగుతున్నాయనే విధంగా మాట్లాడటం దురదృష్టకరం. అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి” అని నారా లోకేష్ అన్నారు.