వెర్రి ముదిరింది.. రోకలి తలకు చుట్టండి! అన్నట్టుగా ఉంది ‘తానా’ నాయకులు చేస్తున్న అతి. తెలుగు భాషాభిమానుల్లొ గందరగోళం. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ నుంచి 2014లో వివిధ కారణాలతో తెలంగాణ వేరు పడి ఉండొచ్చు. కానీ, తెలుగు వేరు పడలేదు కదా!? ప్రాంతాలు వేరైనా మనందరం మాట్లాడేది తెలుగు భాషే. మనందరి మాతృక తెలుగే! అయినంత మాత్రాన ఇప్పుడు హుటాహుటిన ఎన్నడూ లేనిది తెలంగాణ భాషా దినోత్సవాన్ని జరపాల్సిన అగత్యం ఏమొచ్చిందన్నది అసలు ప్రశ్న.
విషయం ఏంటంటే!
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) తాజాగా గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి.. ఏడేళ్లు గడిచిన తర్వాత.. అనూహ్యంగా ఇప్పుడు తెలంగాణ భాషా దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించేందుకు సిద్ధమైంది. దీనికి కవి, ప్రముఖ రచయిత.. `తెలుగు` సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేస్తున్నట్టు భారీ ఎత్తున ప్రకటన జారీ చేసింది. సెప్టెంబరు 9న ఈ కార్యక్రమం చేస్తున్నట్టు ప్రకటన కూడా జారీ చేసింది. అయితే. ఇక్కడే కొన్ని ప్రశ్నలు, కొన్ని సందేహాలు.. అంతకు మించి కొన్ని వివాదాలు కూడా తెరమీదికి వచ్చాయి.
రాజ్యాంగం ఏం చెబుతోంది?
ప్రస్తుతం ‘తానా’ చేస్తున్న ఈ ప్రయోగంతో అసలు తెలంగాణ భాషేనా? అనే సందేహం మేధావి వర్గాల్లోనూ తలెత్తింది. ఎందుకంటే.. రెండు తెలుగు రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్నది తెలుగు మాత్రమే. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లోను, ఆర్టికల్ 344(1), ఆర్టికల్ 351లోనూ మొత్తం 22 భాషలను రాజ్యాంగంలో చేర్చారు. వీటిలో 21వ భాషగా తెలుగుకు ప్రాధాన్యం ఇచ్చారు. దీనిలో ఎక్కడా తెలంగాణ భాష అనిగానీ.. ఏపీ తెలుగు భాష అని కానీ పేర్కొనలేదు. విభజన సమయంలోనూ తెలుగు రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తున్నామనే పార్లమెంటులో ప్రసంగించారే తప్ప.. తెలంగాణ భాష మాట్లాడే వారిని ఒక రాష్ట్రంగా పేర్కొంటున్నామని చెప్పలేదు. పోనీ.. తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా “మా భాష తెలుగు కాదు.. తెలంగాణ సో.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ను సవరించి.. తెలంగాణ భాషకు కూడా గుర్తింపు ఇవ్వండి!“ అని ఎవరూ కోరలేదు. సో.. దీనిని బట్టి ఏపీలో అయినా.. తెలంగాణలో అయినా.. `తెలుగు` ఒక్కటే.
మాండలికమే తేడా!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు `తెలంగాణ భాష` పేరిట వేడుకలు చేయడం.. వివాదంగా మారింది. నిజానికి ఏపీలో మాట్లాడే భాషకు, తెలంగాణలో మాట్లాడే తెలుగు భాషకు మధ్య సారూపత్య లేదా? అంటే.. ఖచ్చితంగా ఉంది. ఎక్కడా విభేదాలు లేవు. కాళోజీ నారాయణ రావు, తిరుపతి వెంకట కవులు, పీవీ నరసింహారావు, సీ నారాయణరెడ్డి వంటి లబ్ధ ప్రతిష్టులు తెలంగాణ వారే. అయినప్పటికీ.. వారు భాషా భేదం ఎక్కడా చూపించలేదు. దీనికి ప్రధాన కారణం.. తెలంగాణ తెలుగైనా.. ఏపీ తెలుగైనా.. ఒక్కటే కనుక! ఒక్క మాండలికమే తేడా! అసలు ఇలా మాండలికాలను బట్టి.. తెలుగును విభజించే పరిస్థితి ఉంటే.. ఏపీలోనే నాలుగు రకాల తెలుగు ఉండేది. ఉత్తరాంధ్రలో ఒకలా మాట్లాడితే.. నెల్లూరు, సీమల్లో మరో రకంగా మాట్లాడతారు. అంతమాత్రాన అందరూ ఒకటి కారా? అందరి భాషా తెలుగు కాదా? తెలంగాణలోనూ అంతేకదా?; అనేది మేధావుల మాట.
మాండలికం సక్సెస్ కాలేదు!
తెలంగాణ ఆవిర్భవించిన కొత్తలో మన భాష మనదే! అని కొందరు వింత పోకడలు పోయారు. ఈ క్రమంలో ‘నమస్తే తెలంగాణ’ వంటి పత్రికలు.. కొన్ని రోజుల పాటు.. అన్ని వార్తలను తెలంగాణ మాండలికంలో ముద్రించాయి. కానీ, ఇది వర్కవుట్ కాలేదు. మాండలికానికి.. అనుసరణకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందనే విషయాన్ని గుర్తించి.. సాధారణ తెలుగు వినియోగానికే పత్రిక మొగ్గు చూపింది. మాండలికం కొన్ని ప్రాంతాలకు పరిమితం.. దానిని అధికారిక భాషగా పేర్కొనే పరిస్థితి లేదు. ఇప్పటికీ తెలంగాణ మాండలిక ప్రభావం ఎంత ఉన్నా.. సాక్షాత్తూ ముఖ్యమంత్రే తెలంగాణ మాండలికంలో మాట్లాడుతున్నా.. అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆదేశాలు… వంటివి సాధారణ తతెలుగు భాషలోనే సాగుతున్న విషయాన్ని భాషాభిమానులు గుర్తు చేస్తున్నారు.
పటాటోపమే పరమావధి!
ఇక, ‘తానా’ చేస్తున్న ప్రస్తుత తెలంగాణ భాషా దినోత్సవం వెనుక పటాటోపం తప్ప మరొక కారణం కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం అమెరికాలో తెలుగు సంఘాల సంఖ్య తామర తంపరగా పెరిగిపోవడంతో ఎవరికి వారు.. గుర్తింపు కోరుకోవడం కోసం.. నానా అగచాట్లు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో ఉన్నవీ లేనివీ కూడా సృష్టించి.. హడావుడి చేసి.. పత్రికల్లో గుర్తింపు కోసం పాకులాడుతున్న పరిస్థితి ఉంది. దీనిలో భాగంగానే ఈ తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలంటూ… హడావుడి చేస్తున్నారని విమర్శకులు పెదవి విరుస్తున్నారు.
పోతనకన్నా.. పండితులా?
నిజానికి కాళోజీ కానీ, సీనారాయణరెడ్డికానీ తెలుగును తెలంగాణ తెలుగని, ఏపీ తెలుగని ఏనాడూ విస్మరించలేదు. వారంతా తెలుగు కవులు. అంతెందుకు.. భాగవతాన్ని తెలుగీకరించిన ఆర్యోత్తముడు.. పోతన తెలంగాణ వాసే అయినా.. భాష వ్యక్తీకరణలో పక్షపాతాన్ని చూపించలేక పోయారు. అందరికీ అర్ధమయ్యే అచ్చ తెలుగునే ఆయన ఎంచుకున్నారు తప్ప.. నేను ఓరుగల్లు వాసినని, నా తెలుగు తెలంగాణ యాస అని ఎక్కడా చొప్పించే ప్రయత్నం చేయలేదు. ఆయన కన్నా ఘనులా.. నేడు తెలుగును విభజించి పబ్బం చేసుకుని.. ప్రచారం కోసం.. పరుగులు పెడుతున్న మేధావులు!! అని నిప్పులు చెరుగుతున్నారు భాషాప్రేమికులు.
ఈ విషయంపై వివరణ కొరకు ‘నమస్తె ఆంధ్ర’ ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రస్తుత ‘తానా’ అధ్యక్షుడు ‘లావు అంజయ్య’ ను వివరణ కోరగా ఇంతవరకు స్పందించలేదు.