అమెరికాలో తెలుగువెలుగులను చాటడంతోపాటు…అమెరికాలో ఉన్న తెలుగువారు తమ హక్కుల సాధనలో ఎదుర్కొంటున్న కష్టాలను అమెరికా ప్రభుత్వానికి తెలియజేసి, సమస్యల పరిష్కారానికి కృషి చేసే బలమైన సంస్థగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఉండాలని, అమెరికాలో తెలుగువాళ్ళ కేరాఫ్ అడ్రస్‌గా’తానా’ నిలవాలన్న ఆకాంక్షతో, తానాను ఆ విధంగా తీర్చిదిద్దాలన్న ఆశయంతో తానా అధ్యక్ష పదవికి పోటీపడుతున్నట్లు, ప్రస్తుత తానా ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు ప్రకటించారు. ఈమేరకు ఆయన ఓప్రకటనను విడుదల చేశారు.
రాబోయే తరానికి తానా ప్రాతినిధ్యం వహించే సంస్థగా నిలవాలి. రేపటి చిన్నారులకు వేదికగా తానా మారాలి. ఇలాంటి పలు లక్ష్యాలతో తానాను మరింతగా మెరుగుపరిచి, పనిచేసేవాళ్ళకే పదవులు అన్నట్లుగా కోవిడ్ కష్టకాలంలో నేనుచేసిన పనితీరు, కాన్ఫరెన్స్ విజయాల్లో నేను చేసిన పనులు, వివిధ సేవా కార్యక్రమాలు, తానాకు విరాళం ఇవ్వడంతోపాటు దాతల నుంచి విరాళాలు వచ్చేలా చేసిన కృషి వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని తానా అధ్యక్షునిగా గెలిపించి, అమెరికాలో తెలుగోడి సత్తా చాటే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు నిరంజన్ శృంగవరపు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.