ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) జాయింట్ సెక్రటరీగా ‘మురళి తాళ్లూరి’ ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 11,277 ఓట్లు సాధించి విజయం దక్కించుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ‘తాళ్లూరి’, ‘తానా’ ఎన్నికల్లో విజయం దక్కించుకోవడం పట్ల తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ‘ తాళ్లూరి’ 1993 వరకు కారేపల్లి లో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు కారేపల్లి లో చదువుకుని ఖమ్మంలో డిగ్రీ పూర్తి చేసి, ఆ తర్వాత హైదరాబాద్ లో ఎంసీఏ పూర్తి చేసిన తర్వాత అమెరికా వెళ్లారు.
అమెరికాలో టెక్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ కంపెనీ స్థాపించి, పలువురు భారతీయ తెలుగు విద్యార్థులకు ఉపాధిని కల్పించారు. ఇక, గడిచిన 20 సంవత్సరాలుగా అమెరికాలోని ఆస్టిన్ టెక్సస్ నగరంలో స్థిరపడ్డారు. ‘తానా’లో 2013 నుంచి 2020 వరకు వివిధ హోదాల్లో పనిచేసి మంచి గుర్తింపు పొందారు. గత ఏడాది కరోనా సమయం లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పేదలకు, వలస కార్మికులకు సేవలు అందించారు. అదేసమయంలో అమెరికాలోని తెలుగు వారికి కూడా సేవలు అందించారు. తద్వారా ‘తానా’లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు.
తాజాగా తానా ఎన్నికల్లో సంయుక్త కార్యదర్శి గా పోటీ చేశారు. ఈ పోటీలొ ప్రత్యర్థిపై 11,277 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తనపై ఉన్న విశ్వాసంతో గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాద్యతలను నిబద్ధతతో పూర్తి చేస్తానని, ‘తానా’ అభివృద్ధి కి శాయ శక్తులా కృషి చేస్తానని అన్నారు. కాగా, ఖమ్మం జిల్లాకు చెందిన ‘మురళి తాళ్లూరి’ విజయం పట్ల ఆయన సహాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.