ఇప్పుడు జరగబోతున్న ‘తానా’ ఎన్నికల్లో ఇరు వర్గాలు మళ్లీ కత్తులు దూసుకొంటున్నాయి.
జరగాల్సిన ‘తానా’ ఎన్నికలను ‘తానా’ బోర్డ్ రద్దుచేయడం మరియు నిత్యం కలహించుకునే వర్గాలన్నీ కుమ్మక్కయ్యి ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా ‘తానా’ ఓటర్లను విస్మరిస్తూ పదవులు పంచుకోవటం రెండూ ధర్మ విరుద్ధమని నిర్దారిస్తూ, రద్దుచేసిన ఎన్నికలను జనవరి 25 లోగా పూర్తి చేయాలనీ నిర్ణయిస్తూ మేరీల్యాండ్ కోర్ట్ ఇచ్చిన ఉత్తర్వలు మేరకు ఎన్నికల యుద్ధం మళ్ళీ మొదలైయ్యింది.
ఈ రెండు వర్గాల కలహాలతో విసిగిపోయిన అనేకమంది మధ్యేవాదులు (నూట్రాల్స్) మరియు ‘తానా’ శ్రేయోభిలాషులు ప్రస్తుత ఉద్ద్రిక్త పరిస్థుతులలో సీనియర్ నాయకుడు మరియు వివాదరహితుడు అయిన ‘శ్రీనివాస గోగినేని’ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ మిగతా పదవులను మంచి సుహృద్భావ వాతావరణంలో సర్దుకుంటే సర్వదా ఉత్తమమనీ, ఏమైనా లోటు పాట్లు మిగిలి ఉంటే మళ్ళీ ఒక్క సంవత్సరంలో తిరిగి వచ్చే ఎన్నికల్లో న్యాయం చేయవచ్చనీ భావిస్తున్నారు.
ఇప్పటికే ఒకసారి సెలెక్ట్ కాబడి రద్దు కారణంగా మళ్ళీ పోటీ చేయవలసిన అనేకమంది (రెండు వర్గాల)అభ్యర్థుల అంతర్గత భావన కూడా ఇదే.
ఇందుకుగాను ప్రస్తుత మరియు గత అధ్యక్షులైన ‘నిరంజన్ శృంగవరపు’, ‘అంజయ్య చౌదరి లావు’ లు చొరవతీసుకుని కృషి చేస్తే తమకు ‘తానా’ సభ్యులు ఇచ్చిన అవకాశాలకు ప్రతిగా సంస్థ బాగుకై మంచి చేసిన వారవుతారని కూడా పలువురు భావిస్తున్నారు.
క్షేత్రస్థాయి పరిస్థితి క్రింది విధంగా కనపడుతోంది!
ప్రస్తుత ‘తానా‘ పరిపాలన
కోర్ట్ ఉత్తర్వుల ప్రకారం కొత్తగా సెలెక్ట్ కాబడ్డ కార్యవర్గాలు రద్దు అయ్యి తిరిగి ఎన్నికలు నిర్వహించే నిమిత్తం పాత 15 మంది బోర్డు సభ్యులను ఎన్నికలు పూర్తి అయ్యేవరకు తిరిగి నియమించారు.
ఆ 15 మంది సభ్యులు కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసి ఆన్లైన్ బాలట్ ప్రక్రియను కూడా ఖరారు చేసింది.
నవంబర్ 16 లోగా కొత్త నామినేషన్ల పంపడానికి ఉన్న గడువుతో ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది.
కాగా చరిత్రలో మొదటిసారిగా ప్రయత్నిస్తూ, ఫార్వార్డింగ్ లేకుండా, ఉత్తర అమెరికాలో మాత్రమే అదీ సెల్ ఫోన్ ఓటీపీ తో పాటు అఫిడవిట్లతో కూడిన ఆన్లైన్ ఓటింగ్ ప్రక్రియ ఒకింత గందరగోళంగా క్లిష్టతరంగానూ ఉండటం తో పాటు కమ్యూనిటీ నిరాసక్తి మూలంగా ఓటింగ్ శాతం అత్యల్పంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు.
అలాగే తిరిగి నియమించబడ్డ ‘తానా’ బోర్డులో తాళ్లూరి వర్గానికి ఉన్న స్వల్ప ఆధిక్యం వల్ల వ్యతిరేక వర్గం ఇబ్బందిగా ఫీలవడం తో పాటు తమ వర్గానికి చెందిన ఒక సభ్యుడిని సస్పెండ్ చేయడం ద్వారా విభేదాలు తారాస్థాయికి చేరడం ‘తానా’ లో ఉన్న అంతర్గత సమస్యల తీవ్రతను తెలియజేస్తుంది.
కొడాలి – లావు ల వర్గం!
రెండు వర్గాలు కలిసి పైకి బలమనిపిస్తున్నప్పటికీ, ప్రయాణం ‘నల్లేరు మీద నడకలా’ ఉండాల్సింది పోయి ‘ఒక సమస్య – రెండు కోర్టు కేసులుగా’ ఒడిదుడుకులతో పడుతూ లేస్తూ సాగడం ఆశ్చర్యం గొలుపుతోంది.
ఈ బృందం అధ్యక్ష అభ్యర్థి ‘నరేన్ కొడాలి’ ఓటర్ల చేర్పింపు పెద్ద ఎత్తున చేసి అంతకంటే ఎక్కువ కోర్టు వ్యాజ్యాల పరంగా ఖర్చు చేసినప్పటికీ ఓట్ల ధ్రువీకరణ సాధించుకో లేకపోవడం దురదృష్టకరమేగాక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా ఉంది.
గుడ్డిలో మెల్లగా అస్మదీయుల సహకారంతో సెలక్షన్ ప్రక్రియ ద్వారా పదవిని చేపట్టగలిగినప్పటికీ వివిధ కారణాల మూలంగా ఆ ప్రక్రియ రద్దయి తిరిగి వోటర్ల తీర్పుకు వెళ్లాల్సి రావడం బాధాకరమే.
అంతేకాక పదవి చేపట్టిన రెండు నెలలు సంస్థ పెద్దగా కాక వర్గం పెద్దగా మాత్రమే వ్యవహరించారనే అపవాదు ఎన్నికల్లో ఇబ్బందికరమే.
దానికి తోడు 2019 కాన్ఫరెన్స్ లెక్కల తేడా మూలంగా వచ్చిన నైతిక బాధ్యత వ్యవహారం ఈయన ఎన్నికల్లో పోటీకి ఇబ్బందేనని వ్యతిరేక వర్గం చేస్తున్న ప్రచారం ఎంతవరకు నిజమో పోటీలోకి వస్తేగానీ తెలియదు.
ఇంకా జులై లో ఈ కూటమి ఆధ్వర్యంలో జరిగిన’ తానా’ కాన్ఫరెన్స్ లోని కొన్ని లోటుపాట్లు కూడా ఎన్నికల్లో ప్రభావం చూపించవచ్చు.
ఎన్నికల ప్రక్రియ మీద అనుమానంతో ఇంకా రెండు మూడు కోర్ట్ కేసులు వేస్తున్నట్లు ఉన్న ప్రచారం వీరి అభద్రతాభావానికి సూచన అని భావించవచ్చు.
మొదటిసారి నిర్వహించబడే ఆన్లైన్ ఓటింగ్ ప్రక్రియ కూడా ఈ వర్గాన్ని గందరగోళ పరుస్తోంది.
క్రితం ఎన్నికల్లో పోటీ చేసిన కొద్దిమంది పోటీకి నిరాసక్తంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే క్రితంలో అనుకూలంగా ఉన్న కొద్దిమంది దూరంగా ఉండటం కూడా ఇబ్బందికరమే
బలాలు
రెండు బలమైన వర్గాల కలయిక, అట్లాంటా మరియు నార్త్ కరోలినా/కాలిఫోర్నియా వంటి చోట్ల ఆధిక్యం, లావు వర్గం టీం వర్క్, మునుపటి అధిష్టానం ఆశీస్సులు.
బలహీనతలు
కొత్త ఓట్ల ధ్రువీకరణ కాకపోవడం, కోర్టు కేసుల నిరంతర పరాజయము, రెండు టీముల వ్యవహార శైలి మధ్య ఉన్న వైరుధ్యాలు, టీం లీడర్స్ పై చెప్పబడుతున్న పోటీ అనర్హతపై అనిచ్చితి, 2019 మరియు 2023 ‘తానా’ కాన్ఫరెన్స్ వివాదాలు, గత అధిష్టానంపై ఇంకా ఉన్న వ్యతిరేకత, కొంతమంది పోటీకి నిరాసక్తత, ‘తానా’ బోర్డు లో మైనారిటీ, వ్యూహ రచన లో తడబాటు/అతివిశ్వాసం.
తాళ్లూరి వర్గం
గతంలో తమతో కలిసి నడచిన ‘లావు వర్గం’ విభేదాలతో వ్యతిరేక వర్గంతో కలిసినప్పటికీ వారికి పోటాపోటీగా వర్గాన్ని నిలుపుకోవటం అభినందించాల్సిన విషయం.
ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీ, వర్జీనియా, ఒహియో, కనెక్టక్యూట్, డిట్రాయిట్, టెక్సాస్ మరియు బే ఏరియా ల్లో బలమైన నాయకుల అండదండలు తో పాటు వ్యూహ రచన కూడా ఇప్పటివరకు తోడ్పడింది.
దీనికి గతంలో తమ మీదే పోటీ చేసిన ‘గోగినేని’నే మధ్యే వాదులకు అనుకూలడనే కారణంగా రద్దైన ఎన్నికల్లో తమ ప్యానెల్ లీడ్ గా ఎన్నుకోవడం ఒక మంచి ఉదాహరణ.
అలాగే ప్రస్తుత అధ్యక్షుడైన ‘నిరంజన్ శృంగవరపు’ ఈ వర్గ నాయకుడవడం ఇంకో బలం.
అయితే ఈ వర్గంలోని మితవాదులకు అతివాదులకు మధ్యన సమన్వయ లోపం చివరకు ఏ విధంగా పరిణమిస్తుందో తెలియకున్నది.
మితవాదులు రహస్య మంతనాలతో ప్రత్యర్థులతో కలిసి గతంలో చేసుకున్న పదవుల పంపిణీ ఒప్పందాన్ని, చేసిన రహస్య విధానాన్ని అతివాదులు తీవ్రంగా వ్యతిరేకించి కోర్టు ద్వారా తిరిగి ఎన్నికలను రప్పించడం వీరి సమర్థతకు నిబద్ధతకు తార్కాణం.
అలాగే గత ఎన్నికల ఒప్పందాన్ని ప్యానెల్ లీడ్ అయిన ‘గోగినేని’కి మాట మాత్రం గానైనా చెప్పకపోవడం మితవాదుల అనైతికత అయితే మళ్ళీ వచ్చిన/తెచ్చిన ఎన్నికల్లో అతివాదుల్లో ఒకరు ‘గోగినేని’కి మాట మాత్రంగానైనా చెప్పకుండా ప్యానెల్ లీడ్ గా ప్రయత్నాలు చేసుకుంటున్నారనే వార్త నిజమైతే ఈ వర్గంలో ఉండే ఇతర నాయకులకు పారాహుషార్.
వ్యతిరేక వర్గం లో ముఖ్యులు కొందరికి పోటీ అనర్హత గండం ఉన్నట్టుగానే ఇందులో కూడా ఒకరిద్దరికి అదే గండం ఉన్నట్లు వినికిడి.
బలాలు
నాయకుల మధ్య ఎన్నికల ఐక్యత, ఎక్కువ రాష్ట్రాల్లో నాయకుల అండ, మెరుగైన వ్యూహ రచన, ప్రస్తుత అధ్యక్షుడి అండదండ, వ్యతిరేక వర్గం లోని కొందరి లోగుట్టు సహకారం, తానా బోర్డు లో ఆధిక్యత
బలహీనతలు
ప్యానెల్ లీడ్ పై చివరి నిమిషంలో కూడా అస్పష్టత, అట్లాంటా/నార్త్ కరోలినా లో నాయకత్వ లోపం, వ్యతిరేకంగా ఉన్న రెండు వర్గాల కలయిక, నాయకులు ఉప నాయకుల మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్, అతివిశ్వాసం, మితవాద అతివాద వర్గాల మధ్య సైద్ధాంతిక వైరుధ్యం
ఇక ‘గోగినేని’ విషయానికి వస్తే ఇంతకు ముందు అనేక పదవులను నిర్వివాదంగా నిర్వహించి గతం లో రెండు సార్లు అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పటికీ వివాదాస్పద వ్యవహార శైలికి భిన్నంగా ఉంటూ తన ప్రత్యర్దులతోపాటు, అన్ని వర్గాల నాయకులు ఉప నాయకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ‘తానా’ సంస్థ అభివృద్దే తన ప్రథమ ప్రాధాన్యం గా వ్యవహరించడం మూలంగా అమెరికా వ్యాప్తంగా మధ్యేవాదుల బలమైన మద్దతును కూడగట్టుకున్నారు.
అందువలననే పోటాపోటీగా ఉన్న ప్రస్తుత ‘తానా’ రాజకీయ ఉద్రిక్తతలలో ఆయన ఎటువైపు మద్దతు ఇస్తే అటువైపు మొగ్గు ఉండే అవకాశాలు మెండుగా ఉండటం ఒప్పుకోవాల్సిందే.
అంతేకాక ఎన్నికలు రద్దుచేసి అప్రజాస్వామికంగా సెలక్షన్ ద్వారా తన ప్రత్యర్థి ‘నరేన్ కొడాలి’ కు అవకాశమిస్తూ ఒక ప్యానెల్ లీడ్ గా ఉన్న తనను పూర్తిగా విస్మరించి నప్పటికీ ఎటువంటి యాగీ చేయకుండా సంస్థ బాగు కోసం సమన్వయం పాటించడం ఎంతోమందిని కదిలించింది.
ఈ సానుభూతి మరియు వ్యక్తిత్వ పరిణితి వలననే ప్రస్తుత పరిస్థితుల్లో ‘గోగినేని’ నాయకత్వం సంస్థ కు సర్వదా ఉపయోగమని పలువురు భావిస్తున్నారు.
ఏకగ్రీవ యత్నాలు!
ప్రస్తుత పరిస్థితుల్లో విద్వేషపూరిత ఎన్నికల కంటే ఒక్కసారి సామరస్య పూర్వక పరిష్కారం లభిస్తే అంతకంతకూ నాయకుల మధ్యన పెరుగుతున్న అంతరాలు తగ్గి ‘తానా’కు అలాగే తెలుగు భాష, సంస్కృతీ మరియు తెలుగు ప్రజల సేవకు పురంకితమయ్యే అవకాశం ముఖ్యంగా సంస్థ 50 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా ఇంకా అవసరమని పలువురు భావిస్తున్నారు.
ఒక ప్యానెల్ లోని ‘నరేన్ కొడాలి’ కు ఒకసారి అవకాశం ఇచ్చినందువలన అంతేకాక ఆయన ఒక ముఖ్య వర్గానికి నాయకుడవటం మూలంగా మళ్ళీ అవకాశమిచ్చినా వైషమ్యాలు తగ్గే అవకాశాలు తక్కువగా ఉండటం మూలంగా మధ్యేమార్గంగా ‘గోగినేని’ కి ప్రస్తుతం అవకాశమిస్తూ మళ్ళీ సంవత్సరం లోగా వచ్చే ఎన్నికల్లో ‘నరేన్ కొడాలి’ కి అవకాశమిస్తే ఉద్రిక్తతలు సద్దుమణిగే అవకాశం కనిపిస్తోంది.
తనకు అవకాశం వచ్చినప్పుడు ‘గోగినేని’ ఎట్టి వ్యతిరేకతను చూపని కారణంగానూ, వయసు అనుభవ పరంగా సీనియర్ అయిన కారణంగా, తనతో కూడా గౌరవనీయ సంబంధాలు ఉన్న కారణంగా ‘నరేన్ కొడాలి’ కూడా ముందుకు వస్తే ‘సమాజం నీరాజనం’ పడుతుందనీ, అన్ని వర్గాలు కలిసి తిరిగి అందరికీ అవకాశాలతో ముందుకు సాగుతుందనీ పలువురు కోరుతున్నారు.
ఈ ప్రతిపాదన ఇప్పటికే నాయకుల మధ్య చర్చ రూపంగా కొనసాగుతూ త్వరలో కార్య రూపం సంతరించే అవకాశం కనిపిస్తోంది.
ముఖ్యంగా ప్రస్తుత అధ్యక్షుడు ‘నిరంజన్ శృంగవరపు’ ఈ ప్రతిపాదనను గట్టిగా సమర్థిస్తూ, మిగతా నాయకులను కూడా సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు.
అలాగే ప్రస్తుత సామాజిక రాజకీయ పరిస్థితుల్లో, అనేక మంది వయసు, ఆరోగ్య, ఆర్థిక కారణాల రీత్యా ఇప్పటి వరకు అనుభవించిన ఇబ్బందులను అధిగమిస్తూ మంచి కై ప్రయత్నాలు కొనసాగాలని కోరుకుందాం.
అన్న గారి ‘కలసి ఉంటె కలదు సుఖం’ మూవీ పాట!
కలసి ఉంటె కలదు సుఖం, వేరు పడితే కలుగును దుఃఖం
చెడు మాటలు విన్నారంటే ఎవరికైనా కలుగును కష్టం
ఘనులెందెరో త్యాగం చేసి సంస్థను నిలబెట్టెనురా
పదవులకోసం తన్నుకు చస్తే పతనం తప్పదురా
కలసి ఉంటే కలదు సుఖం, వేరు పడితే కలుగును దుఃఖం
చెడు మాటలు విన్నారంటే ఎవరికైనా కలుగును కష్టం