అనూహ్య మలుపులతో రెండేళ్ల పాటు కొనసాగిన ‘తానా’ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి.
జనవరి 18న ప్రకటించిన ఎన్నికల ఫలితాల ప్రకారం మొత్తం అ;న్ని జాతీయ పదవులను డాక్టర్ నరేన్ కొడాలి సారథ్యంలోని ‘టీం కొడాలి’ దక్కించుకొని ‘జయహో’ అనిపించుకుంది.
సతీష్ వేమూరి ఆధ్వర్యంలోని ‘టీం వేమూరి’ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కుదేలైంది.
అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ‘నరేన్ కొడాలి’కి మద్దతుగా పోటీనించి తప్పుకొని కీలమైన సమయంలో వ్యూహాత్మకంగా నరేన్ ప్యానెల్ విజయానికి సహకరించిన ‘శ్రీనివాస గోగినేని ‘అదరహో’ అనిపించుకున్నారు.
ఇంచుమించుగా అతిరథ మహారధులైన ‘తానా’ నాయకులు అందరూ కీలకంగా వ్యవహరించిన ఈ ఎన్నికల ప్రహసనంలో ప్యానెల్స్ కు అన్ని విధాలుగా సారథ్యం వహించిన నరేన్ కొడాలి, శ్రీనివాస గోగినేని మరియు సతీష్ వేమూరి ల చుట్టూ ఎన్నికల వ్యూహాలు నడిచాయి.
టీం కొడాలి!
గొప్ప పోరాట స్ఫూర్తిని ఆద్యంతం ప్రదర్శిస్తూ తన టీంను విజయపథంలో నడిపి సభ్యులందరికీ విజయాన్ని అందించి ‘తానా’ తదుపరి అధ్యక్ష పీఠాన్ని నరేన్ కొడాలి అధిరోహించబోతున్నారు.
వ్యక్తిత్వహననాన్ని సహిస్తూ, ఆర్థిక భారాన్ని భరిస్తూ, అనేక ఎదురుదెబ్బలను చెదరని చిరునవ్వుతో ఎదుర్కొంటూ, తాత్కాలిక అపజయాలకు వెరవకుండా, ముందుకే కొనసాగుతూ ‘తానా’ అధ్యక్షుడిగా ఆయనే ‘సరైనోడు’ అని ప్రత్యర్థులతోనే అనిపించుకొని, అఖండ విజయం సాధించిన ‘నరేన్ కొడాలి’కి హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు.
తమ వర్గ ముఖ్య నాయకుల తోడ్పాటును నిలుపుకోవడంతోపాటు ఆద్యంతమూ అనేక నగరాలు పర్యటిస్తూ అనేకమంది మద్దతును కూడగడుతూ, ముఖ్యమైన అట్లాంటా లావు వర్గంతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ వరకు అంతే సహనంతో ఉండడం సామాన్యమైన విషయం కాదు.
అంతేకాకుండా, ఎన్నికల కీలక దశలో తన పూర్వ ప్రత్యర్థి మరియు సీనియర్ అయిన శ్రీనివాస గోగినేని ఇంటికి స్వయంగా వెళ్లి, మద్దతు కోరి సాధించుకొని వెంటనే అదే స్పూర్తితో పూర్వ అధ్యక్షుడు మోహన్ నన్నపనేనిని బోస్టన్ లో కలిసి మద్దతు పొందడం ఈ ఎన్నికల్లో అత్యంత కీలకమైన విషయంగా చెప్పవచ్చు.
టీం వేమూరి అవిరామంగా చేస్తున్న దుర్భాషలతో కూడిన నెగెటివ్ ప్రచారం మధ్య టీం కొడాలి సభ్యులందరికీ శ్రీనివాస గోగినేని, మోహన్ నన్నపనేనిల మద్దతు ఎడారిలో ఒయాసిస్ లా అనిపించి టీం కొడాలిలో మరింత స్ఫూర్తి నింపింది.
అతి ముఖ్యంగా టీం కొడాలి విజయానికి పోటీలో ఉన్న లావు శ్రీనివాస్, రవి పొట్లూరి, రాజా కసుకుర్తి ప్రత్యక్షంగా ముఖ్య భూమిక పోషించగా, అదే ప్యానెల్ సభ్యులైన భక్త బల్లా, వెంకట్ కోగంటి, సునీల్ పాంత్రా, లోకేష్ నాయుడు, ఠాగూర్ మలినేని, సతీష్ కొమ్మన, నాగ పంచుమర్తి, శ్రీనివాస్ కూకట్ల తదితరులు విశేష కృషి చేశారు.
ఇక ఈ టీం కొడాలికి తానా మాజీ అధ్యక్షులు, టీడీపీ ఎన్నారై ప్రముఖులు జయరాం కోమటి, గంగాధర్ నాదెళ్ల, సతీష్ వేమన, అంజయ్య చౌదరి లావులతో పాటు శశికాంత్ వల్లేపల్లి, వాసు కొడాలి, జానీ నిమ్మలపూడి, హేమ కానూరి, అనిల్ ఉప్పలపాటి తదితరులు మద్దతుగా నిలిచి ఆహర్నిశలు కృషిచేసి అన్ని విధాలా ‘నరేన్ కొడాలి’కి వెన్నుదన్నుగా నిలిచారు.
ఎప్పటికైనా ‘తానా’ ఎన్నికల గెలుపునకు తామే తురుపు ముక్కలమని లావు టీం నిరూపించడం మరచిపోకూడదు.
ఒక్క అట్లాంటాలోనే 1200 ఓట్ల మెజారిటీ లావు టీంకు రావడం గమనార్హం.
టీం వేమూరి!
‘అలవిగాని చోట అధికులమనరాదు’ అనే నానుడి మరచి ఒక సేవా సంబంధిత సంస్థ ప్రజాస్వామ్య ఎన్నికలలో ఏమి చేయకూడదో అన్నీ చేసి పరాజయాన్ని పొందిన టీం వేమూరి ఉరఫ్ జయ్ వర్గం గురించి ఎంత చెప్పిన తక్కువే.
టీం సభ్యులను సొంత ఆస్తిగా భావిస్తూ, నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుంటూ, పోటీదారుల ఆత్మగౌరవానికి మరియు మనోభావాలకు విలువనివ్వకుండా, సంస్థ లేదా టీం ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రతీకారాలకు, స్వార్థ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ, స్వలాభాన్ని అతిగా ఊహించుకుంటూ, ప్రత్యర్థుల బలాన్ని విస్మరిస్తూ తమ వర్గానికి తీరని అన్యాయం చేసుకున్నారు.
ఈ ఎన్నికల్లో వీరి ధోరణిని గమనించిన తర్వాత లావు వర్గం ఒక్క నెలలోనే వీరిని వదిలించుకుని ప్రత్యర్థి వర్గంతో ఎందుకు చేతులు కలిపిందో అర్థం చేసుకోవచ్చు.
తమతో పాటు కలిసి పోటీ చేసి విజయం పొందిన తరువాత లావు వర్గం తమను వీడి నరేన్ కొడాలి వర్గంతో కలవడంతోనే తాము మైనారిటీలో పడిన విషయం గమనించిన జయ్ వర్గం అనేక టక్కుటమార విద్యలను రెండు సంవత్సరాలుగా ప్రయోగించింది.
తమ గారడీ మాంత్రికులైన అశోక్ కొల్లా మరియు సతీష్ ల ప్రతిభపై మితిమీరిన విశ్వాసంతో తమతో పాటు నమ్మి ప్రయాణించిన అనేకమంది పోటీదారుల భవిష్యత్తుతో ఆటలాడుకుని వారిని ఆర్థికంగా, సామాజికంగా మరియు సంస్థాపరంగా తీవ్రంగా నష్టపరిచింది.
ఈ ప్రయత్నంలో అనేక వ్యయ ప్రయాసలతో గెలిచి పరిపాలన సాగించాల్సిన ప్రస్తుత అధ్యక్షుడు నిరంజన్ ను కూడా భాగస్వామిని చేసి భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేసుకుంది.
ముందుగా తమ వర్గం మైనారిటీలో పడిన విషయాన్ని గమనించి ఎన్నికల ముందు పదవులకై బేరసారాలాడింది.
తమకు మూడో వంతు కూడా దక్కని పరిస్థితుల్లో కొత్త సభ్యులకు ఓటు హక్కు వివాదంలో పడటంతో ఎన్నికల పోటీ నాటకానికి తెర లేపింది.
మధ్యేవాదులకు ఇష్టుడిగా ఉంటూ సేవా సంస్థలో అధిపత్య ధోరణులపై పోరాడే సీనియర్ నాయకుడు శ్రీనివాస గోగినేనికి వల విసిరి తమ పానెల్ నాయకత్వం వహిస్తే గెలిపించి సంస్థ ప్రగతికి తోడ్పడతామని నమ్మించి, వారితో పాటు అనేకమందిని ఆకర్షించి టీం గోగినేని ప్యానెల్ ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది.
అటు టీం గోగినేని స్వంత నిధులతో ఊరూరా తిరిగి ప్రచారం నిర్వహిస్తుంటే వర్గ నాయకులు తెరవెనుక కులాసాగా ఎన్నికలను అడ్డంపెట్టుకుని బేరసారాలు సాగించారు.
ఎన్నికల తల నొప్పిని నివారించడానికి, అలాగే ‘తానా’ కాన్ఫరెన్స్ టైం దగ్గర పడుతున్నందున ఎన్నికల అవగాహనకు ప్రత్యర్థులు సిద్దపడటంతో, టీం గోగినేని చేస్తున్న ఉదృత ప్రచారాన్ని అడ్డంపెట్టుకుని అధిక పదవులను సాధించుకున్నది.
అలాగే అధ్యక్ష పదవికి నరేన్ ను అంగీకరిస్తూ, తమ అధ్యక్ష అభ్యర్థికి మరొక బోర్డు పదవిని కూడా ఒప్పించుకొని, తీరా సమయానికి, తమకు వచ్చిన రెండు బోర్డు పదవులను ఒకటి నామినేషన్ కూడా వేయని సతీష్ వేమూరికి, ఇంకోటి తమ ఇంటర్నల్ అభ్యర్దికి ఇచ్చి గోగినేనికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా అవమానపరిచారు.
అలాగే, తమ అధ్యక్ష అభ్యర్థి గోగినేనికి ఓటు వేయకపోయినా పర్లేదు తమకు వేస్తే చాలని నిస్సిగ్గుగా ప్రచారం నిర్వహించిన అశోక్ కొల్లా తదితరులు కిమ్మనకుండా పదవులు పుచ్చుకున్నారు.
కోర్ట్ ఉత్తర్వుల మూలంగా సెలెక్షన్స్ రద్దయి మళ్ళీ ఎన్నికలు వస్తే వీరికి తెలివి రావడానికి బదులు, వారికి మరికొందరు అతి తెలివితేటలు గలవారు గూడ తోడై కొంప కొల్లేరు చేసుకున్నారు.
అప్పటికే పలువురు సభ్యుల సానుభూతిని పొందిన గోగినేనిని బతిమాలుకొని తిరిగి పోటీ చేయించుకోవాల్సి ఉండగా అతిశయంతో ఆయనకు కనీసం తెలియపరచకుండా తమ ప్యానెల్ నాయకుడిగా సతీష్ వేమూరిని ప్రకటించుకున్నారు.
తమ అశోక్, సతీష్ లతోపాటు మరికొద్ది మంది సహకారంతో ఎన్నడూ కనీవినీ ఎరగని నెగటివ్ ప్రచారంతో కమ్యూనిటీ మనసులను కలుషితం చేస్తూ ఎన్నికల విజయానికి కొత్త ప్రయోగాలకు తెర తీయగా ‘తానా’ సభ్యులు సరైన సమాధానం ఇచ్చి తిప్పికొట్టారు.
చెబితే ఇంకా చేంతాడంత ఉంది గనక ఇక్కడితో ఆపుదాం.
శ్రీనివాస గోగినేని!
సేవా సంస్థలో అధిపత్య ధోరణులపై పోరాడే సీనియర్ నాయకుడు, తానా ఫౌండేషన్ మాజీ చైర్మన్ శ్రీనివాస గోగినేని అంతకు ముందు రెండు సార్లు పోటీ చేసిన అనుభవంతో ‘తానా’ సంస్థలో ఇండిపెండెంట్ గా నెగ్గడం కష్టమని, కానీ తాననుకున్న సంస్కరణలు తేవాలంటే ఒక వర్గ సహకారంతోనే సాధ్యమని తెలుసుకున్నట్లు చెబుతున్నారు.
జయ్ వర్గం తనను టీం గోగినేని ప్యానెల్ లీడ్ గా అంగీకరించినప్పుడు అదే నిజమని నమ్మి స్వంత ఖర్చులతో నిజమైన పోరాట స్ఫూర్తితో ఒక ఒరవడిని సృష్టించారు.
అయితే దానిని వాడుకుని తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా సెలక్షన్ ప్రాసెస్ అవగాహనకు వచ్చినప్పుడు కూడా తనకు జరిగిన అన్యాయాన్ని సహిస్తూ నరేన్ కొడాలిని అంగీకరిస్తూ సెలక్షన్ ద్వారా కాక ఎన్నికల అవగాహనలో భాగంగా చేద్దామని ప్రతిపాదించారు.
చివరకు కోర్టు ద్వారా వచ్చినా మళ్ళీ ఎన్నికల్లో తనకు తెలియకుండానే, ఇంకా తాను చేసిన కృషిని కనీసం గుర్తించకుండా టీం గోగినేనిని మార్చి వేరే వ్యక్తితో టీం వేమూరిగా ఎన్నికల్లో వెళ్లడం అవమానంగా భావిస్తూ ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు.
అయితే, నరేన్ కొడాలి తమ ఇంటికి వచ్చినప్పుడు అనేక విషయాలపై సమగ్రంగా చర్చించి, తమ ఇద్దరి మధ్యన అంతకుముందు ఉన్న వర్కింగ్ రిలేషన్ దృష్ట్యా నమ్మదగిన మిత్రుడిగా భావిస్తూ పరిస్థితిని విశ్లేషించుకున్నారు.
తుదకు వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలన్న సత్యాన్ని గ్రహించి ‘తానా’ సంస్థ ప్రగతి మరియు తన ఆశయాల సాధనకై మొట్ట మొదటిసారిగా చురుకైన, అలాగే పదునైన రాజకీయ నిర్ణయం తీసుకొని మనస్ఫూర్తిగా ‘నరేన్ కొడాలి’కి , అయన ప్యానెల్ కు బహిరంగంగా మద్దతు ఇవ్వడమే కాకుండా కీలకంగా, అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి టీం కొడాలి విజయానికి శ్రీనివాస గోగినేని సహాయపడ్డారు.
ఇంకా విచిత్రమేమంటే అప్పటివరకు తమ ప్రత్యర్థి ప్యానెల్ ముఖ్య నాయకుడిగా ఉన్నప్పటికీ న’రేన్ కొడాలి’ వర్గంలోని నూటికి నూరు శాతం మంది ఆయన మద్దతును హర్షిస్తూ ఆహ్వానించడం అనేకమందిని విస్మయపరిచింది.
‘తానా’ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అనేకమంది ఈయనలో విలువలతో కూడిన సేవాభావంతో పాటు అవసరమైతే నైపుణ్యత కలిగిన రాజకీయ వ్యూహకర్త కూడా ఉన్నారని చెప్పుకుంటున్నారు.
ఏదేమైనా నరేన్ కొడాలి మరియు ఆయనతో పాటు ఉన్న మద్దతుదారులు అత్యంత బలమైన వర్గంగా ఏర్పడి సమిష్టి కృషితో 100 శాతం విజయతీరాలకు చేరడం ముదావహం.
ఈ విజయం తర్వాతైనా గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న అంతర్గత ఇబ్బందులను అధిగమించి స్వర్ణోత్సవాల సమయానికి ‘తానా’ పూర్వ ప్రాభవం తెచ్చుకుని మరింతగా తెలుగు సమాజానికి సేవ చేస్తుందని ఆశిద్దాం!
ఈవీపీ
నరేన్ కొడాలి – 13225 ✌️
సతీష్ వేమూరి – 10362
బీవోడీ
లావు శ్రీనివాస్ – 12695 ✌️
రవి పొట్లూరి- 13044 ✌️
సురీష తూనుగుంట్ల – 11237
మల్లి వేమన – 11774 ✌️
శ్రీనివాస్ ఉయ్యూరు – 10520
వెంకట రమణ యార్లగడ్డ- 10131
కార్యదర్శి
రాజా కసుకుర్తి – 12456✌️
అశోక్ కొల్లా – 11083
కోశాధికారి
భరత్ మద్దినేని – 12827✌️
మురళి తాళ్లూరి – 10617
జాయింట్ సెక్రటరీ
వెంకట్ కోగంటి – 13015✌️
వంశీ వాసిరెడ్డి – 10501
జాయింట్ ట్రెజరర్
సునీల్ పంత్రా – 13013✌️
శశాంక్ యార్లగడ్డ – 10463
కమ్యూనిటీ సర్వీస్ కో ఆర్డినేటర్
రజినీ ఆకురాటి – 10177
లోకేష్ కొణిదల – 13362✌️
సాంస్కృతిక సేవా సమన్వయకర్త
రజనీకాంత్ కాకర్ల – 10854
ఉమా ఆర్ కాటికి – 12638✌️
మహిళా సేవల సమన్వయకర్త
సోహిని అయినాల- 12009✌️
మాధురి యేలూరి – 11436
కౌన్సిలర్ ఎట్ లార్జ్
ప్రదీప్ గడ్డం – 10590
సతీష్ కొమ్మన – 12827✌️
అంతర్జాతీయ కో ఆర్డినేటర్
శ్రీధర్ కొమ్మాలపాటి – 10168
ఠాగూర్ మల్లినేని – 13300✌️
స్పోర్ట్స్ కోఆర్డినేటర్
శ్రీరామ్ ఆలోకం – 10213
నాగ పంచుమూర్తి -13261✌️
ఫౌండేషన్ ట్రస్టీ
రామకృష్ణ అల్లు – 12515✌️
భక్త బల్లా – 13552✌️
శ్రీనివాస్ కూకట్ల – 12286✌️
సత్యనారాయణ మన్నె -11196
రవికిరణ్ మువ్వ – 10490
నాగరాజు నలజుల – 9883
సుమంత్ రామ్ – 9643
రవి సామినేని – 10148
రాజా సూరపనేని – 13170✌️
ఎండూరి శ్రీనివాస్ – 12261✌️